Health Department: నేటి నుంచి తురకపాలెంలో వైద్యశిబిరాలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:47 AM
ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన జ్వరాల కట్టడికి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇక్కడ ప్రమాదకర మెలియోయిడోసిస్ జ్వరాలు....
15 రోజులపాటు నిర్వహణ.. గ్రామంలో అందరికీ పరీక్షలు
జ్వర బాధితులకు బ్లడ్ కల్చర్ పరీక్షలకు ఏర్పాట్లు
మట్టి, నీటి నమూనాల సేకరణకు ప్రత్యేక బృందాలు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిన జిల్లా యంత్రాంగం
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన జ్వరాల కట్టడికి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇక్కడ ప్రమాదకర మెలియోయిడోసిస్ జ్వరాలు ప్రబలినట్లు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో... గ్రామంలో మంగళవారం నుంచి 15 రోజులపాటు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కే విజయలక్ష్మి, గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వితో పాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి 15 రోజుల పాటు రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ వైద ్య శిబిరాలు అందుబాటులో ఉంటాయి.
రంగంలోకి స్పెషలిస్టులు...
జ్వరం, ఆయాసం, దగ్గు ఉన్న వారు ఈ శిబిరాలకు నాగలక్ష్మి సూచించారు. ఈ వైద్య శిబిరాల్లో సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రిస్టులు గ్రామస్తులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. గ్రామంలో మొత్తం 2,200 మంది ఉన్నట్లు గుర్తించగా.. వారందరికీ వైద్యపరీక్షలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం వల్ల గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. బాధితులకు బ్లడ్ కల్చర్ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైక్రోబయాలజీ వైద్యనిపుణులు ఈ శిబిరాల్లో రక్త నమూనాలు సేకరిస్తారు. ఈ జ్వరాలకు కారణమయ్యే బర్కోల్డేరియా సూడోమల్లీ బ్యాక్టీరియా మట్టిలో, నీటిలోనూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయిల్, వాటర్ శాంపిల్స్ సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
రెండు నెలల్లో 40 మంది మృతి... కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు సోమవారం గుంటూరు జీజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సబిత, డాక్టర్ తేజ ఆధ్వర్యంలో వైద్య బృందం తురక పాలెలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జూలైలో 20 మంది, ఆగస్టులో 20 మంది జ్వరాలతో మృతి చెందినట్లు తేలింది. కేవలం రెండు నెలల్లోనే 40 ఫీవర్ మరణాలు నమోదుకావడంతో.. ఈ ఐదు నెలల్లో వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అనుమానిస్తున్నారు.