ప్రతి రైతుకు అందించేలా చర్యలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:35 PM
అర్హత ఉన్న ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత బాషా రెవెన్యూ, వ్యవసాయ శాఖల యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఆగస్టు 2న ‘అన్నదాత సుఖీభవ’ జమ
కలెక్టర్ రంజిత బాషా
కర్నూలు అగ్రికల్చర్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత బాషా రెవెన్యూ, వ్యవసాయ శాఖల యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన పథకాల నిధుల జమ చేసే అంశంపై రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులపై టెలి కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లా మొత్తం మీద 2,75,749 మంది రైతులకు గానూ పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కౌతాళం 258 మంది రైతులు, హాలహర్విలో 195, చిప్పగిరిలో 182, పత్తికొండలో 180, ఆలూరలో 172 మంది రైతులను పెండింగ్‌లో ఉంచారని, ఎందుకు పెండింగ్‌లో ఉందని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో ఆరా తీశారు. కొంత మంది రైతులు పొలం ఉన్న చోట కాకుండా వివిద కారణాలతో ఇతర ప్రదేశాల్లో నివాసం ఉంటున్నారని, మరి కొంత మంది చనిపోయారని కలెక్టర్‌కు వివరించారు. ఈ టెలి కాన్ఫరెన్సలో జేసీ డా.బి.నవ్య, వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీవో భరత నాయక్, ఎల్‌డీఎం రామచంద్రరావు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.