చేనేత యూనిట్ల పునరుద్ధరణకు చర్యలు: సీఎస్
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:37 AM
రాష్ట్రంలో చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ చెప్పారు.
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో స్పిన్సింగ్ మిల్స్ సమస్యలపై ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యుత్, చేనేత, జౌళి శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ చర్చించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చేనేత, జౌళి యూనిట్ల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలు, ఈ రంగానికి అమలు చేయాల్సిన పథకాలు, ప్రోత్సాహకాలపై సమగ్రంగా చర్చించారు. టెక్సటైల్ రంగంలో సిక్ అయిన యూనిట్ల పునరుద్ధరణకు ప్రభుత్వపరంగా ఏ మేరకు సహాయాన్ని అందజేసే అవకాశం ఉంటుందో అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టెక్స్‌టైల్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కోటేశ్వరరావు, సుధాకర్, ఫణి తదితరులు మాట్లాడుతూ... ‘పెండింగ్ రాయితీ బకాయిలను విడుదల చేసి, కరెంట్ టారిఫ్‌లో యూనిట్‌కు ఇస్తున్న రూ.2 రిబేటును నెలవారీ బిల్లులో తగ్గించేలా చూడాలి. టెక్స్‌టైల్ పరిశ్రమలే సొంతంగా క్యాప్టివ్ పవర్ యూనిట్లు స్థాపించుకునేందుకు తగిన అనుమతులు, రాయితీలు ఇవ్వాలి. ప్రస్తుతమున్న ఈడీ చార్జీల విషయంలో పాత విధానాన్నే అనుసరించాలి’ అని కోరారు.