Mauritius Prime Minister: శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:36 AM
మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులామ్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న...
తిరుమల/రామచంద్రాపురం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులామ్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం అయన కుటుంబ సమేతంగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన నవీన్‌చంద్ర రాంగులామ్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ఆ తర్వాత మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. మంత్రి ఆనం, చైర్మన్, ఈవో శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ్నుంచి రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని బ్రహ్మర్షి గురూజీ సిద్ధేశ్వరతీర్థ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి గురువానంద గురూజీ ఆశీస్సులతో తాను నాలుగుసార్లు మారిషస్ ప్రధాని అయ్యానన్నారు. మారిష్‌సలో విద్య, వైద్యం అభివృద్ధికి బ్రహ్మర్షి ఆశ్రమం తరపున వెయ్యి మిలియన్ల డాలర్లు వితరణ చేయనున్నట్టు గురువానంద తెలిపారు.