మట్కా వ్యసనం.. ఆలయంలో చోరీ..!
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:39 PM
జూదం కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాదు.. దొంగతనాల చేయించి జైలుపాలు చేస్తుంది.
4 కిలోల వెండి, 10 గ్రాముల బంగారు అపహరణ
ఆలయ పూజారే నిందితుడు
ఆదోని, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జూదం కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాదు.. దొంగతనాల చేయించి జైలుపాలు చేస్తుంది. మట్కా బారిన పడిన ఓ పూజారి అప్పులు అధికమై ఏమి చేయాలో తెలియక ఏకంగా దేవుడి ఆభరణాలనే కాజేశాడు. రూ.5లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను చోరీ చేసి, పోలీసులకు చిక్కి కటకటాలపాలైన సంఘటన ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం డీఎస్పీ హేమలత విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో వెలిసిన వసిగేరప్పస్వామి దేవాలయంలో స్వామి కోసం చేయించిన 4.386 కిలోల వెండి ఆభరణలతో పాటు 10 గ్రాములు బంగారు నగలను అదే దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న గొర్రెల వసిగేరప్ప దొంగలించాడు. నెలరోజుల క్రితం అపడున్న ఇస్వీ ఎస్‌ఐకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి అనుమానితుడు గొర్రెల వసిగేరప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆలయంలో దేవుడు సొమ్మును తానే దొంగలించినట్లు వసిగేరప్ప ఒప్పుకున్నాడు. మట్కా ఆడడం తనకు అలవాటుగా మారి పెద్ద ఎత్తున అప్పులు చేశానని పోలీసుల ఎదుట విలపించాడు. దొంగలించిన నగలను విక్రయించి అప్పులను తీర్చాలని అనుకున్నట్లు తెలిపాడు. అయితే ఇంట్లో ఉంచిన వెండి, బంగారు ఆభరణాలను విక్రయించేందుకు కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి తరలిస్తుండగా ఇస్వీ పోలీసులు చాగి గ్రామం సమీపంలో వసిగేరప్పను అదుపులోకి తీసుకుని విచారించామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నల్లప్ప, ఇస్వీ ఎస్‌ఐ నాయక్, తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు పాల్గొన్నారు.