Share News

Visakhapatnam: మాస్టర్‌ ప్లాన్‌ మాయ

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:46 AM

విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రతి ఇరవై ఏళ్లకు ఒకసారి నగరాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేస్తుంది. దాని ప్రకారమే భవన నిర్మాణాలకు అనుమతులిస్తారు.

Visakhapatnam: మాస్టర్‌ ప్లాన్‌ మాయ

  • విశాఖ కొండల్ని కొల్లగొట్టేందుకు నాడు వైసీపీ ఎత్తు

  • దానికోసం మిక్స్‌డ్‌ జోన్‌లోకి మార్చి విధ్వంసం

  • రామానాయుడు స్టూడియోలోనూ లేఅవుట్‌

  • సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆగిన పనులు

  • రుషికొండకూ పర్యాటకం పేరుతో టెండర్‌

  • తిరిగి‘ నో డెవల్‌పమెంట్‌ జోన్‌’లోకి తేవాలి

  • కూటమి సర్కారుకు పర్యావరణవేత్తల వినతి

విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ తీరం వెంబడి ఉన్నకొండల్ని కొల్లగొట్టేందుకు గత వైసీపీ ప్రభుత్వం ‘మాస్టర్‌ ప్లాన్‌’ వేసింది. ఇప్పుడు అదే ప్లాన్‌ను కొనసాగిస్తే కొండలన్నీ కాంక్రీట్‌ నిర్మాణాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ హయాంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో సవరణల నిమిత్తం కూటమి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తోంది. ఇప్పుడైనా గత ప్రభుత్వ నిర్ణయాలను మార్చి విశాఖ కొండలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రతి ఇరవై ఏళ్లకు ఒకసారి నగరాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేస్తుంది. దాని ప్రకారమే భవన నిర్మాణాలకు అనుమతులిస్తారు. విశాఖ నుంచి భీమునిపట్నం వరకు తీరం వెంబడి కైలాసగిరి, సీతకొండ, కప్పరాళ్ల కొండ, రుషికొండ, బావికొండ, తొట్లకొండ, పావురాల కొండ.. ఇలా అనేకం ఉన్నాయి. వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2021లో అవన్నీ కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌లో (సీఆర్‌జెడ్‌) చూపించారు. ‘నో డెవల్‌పమెంట్‌ జోన్‌’గా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మాస్టర్‌ ప్లాన్‌-2041 రూపొందించింది. అప్పటికే విశాఖ నుంచి భీమిలి వరకు వందలాది ఎకరాలు సొంతం చేసుకున్న వైసీపీ పెద్దలు వారి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో అవసరమైనవన్నీ చేర్పించారు. అప్పుడే రుషికొండపై పర్యాటక వసతి గృహాలను కూలగొట్టి జగన్‌ కుటుంబం కోసం సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో కొత్తభవనం నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వాటికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడానికి అప్పటి ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా మొత్తం కొండలన్నింటినీ కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో ‘మిక్స్‌డ్‌ జోన్‌’గా మార్చేసింది. అంటే ‘నో డెవల్‌పమెంట్‌ జోన్‌’ పదం మాయమైంది. దీంతో ఆయా కొండపై నిర్మాణాలు చేపట్టేందుకు మార్గం సులువైంది.


కొండలపై గునపం..

‘మిక్స్‌డ్‌ జోన్‌’ను అడ్డం పెట్టుకొనే తిమ్మాపురంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు స్టూడియో నిర్మాణానికి ఇచ్చిన కొండలో కొంత భాగం కొల్లగొట్టేశారు. వాస్తవానికి అక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి పనులు మాత్రమే చేపట్టాలి. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో అది మిక్స్‌డ్‌ జోన్‌గా ఉన్నందున లేఅవుట్‌ వేయించి అందులో వాటా కొట్టేశారు. దీనిపై విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంతో అక్కడ లేఅవుట్‌ చెల్లదని తీర్పు వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, వాటిని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సవాల్‌ చేసింది. ఇదిలా ఉండగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులుప్పాడ సమీపాన బావికొండపై అతి పెద్ద ప్రభుత్వ అతిథిగృహం నిర్మాణానికి నడుం కట్టింది. అనుమతులు లేకుండానే జేసీబీలతో కొండను చదును చేసింది. దీనిపై ప్రజా సంఘా లు హైకోర్టులో కేసు వేయగా, పనులు ఆపాలని కోర్టు ఆదేశించింది. దీంతో వైసీపీ పెద్దలు రుషికొండపై పడ్డారు. అక్కడ పర్యాటకశాఖ రిసార్ట్స్‌ను కూలగొట్టి పాత అనుమతులతోనే కొత్తది నిర్మించారు.


మాస్టర్‌ ప్లాన్‌ మార్చాలి..

విశాఖ నగరంలో కైలాసగిరి ఉంది. అది పర్యాటక/ఆధ్యాత్మిక ప్రాంతం. రెవెన్యూ అధికారులు దాన్ని ఒక పార్కులా అభివృద్ధి చేయడానికి వీఎంఆర్‌డీఏకు ఇచ్చారు. దానిపై పదేళ్ల క్రితమే పర్యాటకులు బస చేసేందుకు గెస్ట్‌ హౌస్‌ల నిర్మాణానికి నడుం కట్టారు. కొంత వరకు పనులు కూడా చేపట్టారు. దానిపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో, వాటిని ఆపేశారు. ఇప్పుడు మళ్లీ అక్కడ నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నారు. కప్పరాళ్లకొండను రెవెన్యూ అధికారులు పర్యాటక శాఖకు అప్పగించారు. అక్కడ హెల్త్‌ స్పా ఏర్పాటుకు 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. వారు కూడా ఢిల్లీ నుంచి అష్టకష్టాలు పడి అనుమతులు తెచ్చుకొని ‘బే పార్క్‌’ ఏర్పాటుచేశారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. విశాఖలో కొండలను కొల్లగొట్టడానికి కారణమైన మాస్టర్‌ ప్లాన్‌-2041ను మార్చాలని, ‘మిక్స్‌డ్‌ జోన్‌’ నుంచి తొలగించి, వాటిని రక్షించడానికి తిరిగి ‘నో డెవల్‌పమెంట్‌ జోన్‌’గా చేర్చాలని విశాఖలో పర్యావరణ వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కొందరు వీఎంఆర్‌డీఏకు విన్నపాలు కూడా సమర్పించారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొండలను ‘మిక్స్‌డ్‌ జోన్‌’ నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Aug 09 , 2025 | 03:47 AM