Share News

CM Chandrababu: మార్కెట్‌ కమిటీల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 06:22 AM

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu: మార్కెట్‌ కమిటీల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

  • రాష్ట్రంలోని రైతుబజార్ల ఆధునికీకరణ

  • రైతుసేవా కేంద్రాల పునర్వ్యవస్థీకరణ

  • 4 జిల్లాల్లో బర్లీ పొగాకుకు క్రాప్‌ హాలిడే

  • ‘ఆధార్‌’తోనే ఎరువుల పంపిణీ

  • యూరియా సరఫరాపై రికార్డుల నిర్వహణ

  • పక్కా ప్రణాళికతో రబీ సీజన్‌కు సిద్ధంకండి

  • వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం

  • పంటలకు మద్దతు ధరలపై పోస్టర్‌ విడుదల

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 218 మార్కెట్‌ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై గురువారం సీఎం సమీక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ ‘రైతులకు లాభం రావాలి. వినియోగదారులకు ప్రయోజనం కలగాలి. ఇందుకోసం వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలి. రాష్ట్రంలో రైతుబజార్లను ఆధునీకరించాలి. మొబైల్‌ రైతుబజార్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. మార్కెట్‌ కమిటీలను, రైతుబజార్లను అనుసంధానం చేసేలా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి’ అని చెప్పారు. రానున్న రబీ సీజన్‌ కోసం 23లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు సీఎంకు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘రబీ సాగు కోసం భూసార పరీక్షలు చేసి, ఆ డేటా ప్రకారం సూక్ష్మపోషకాలు వేసుకునేలా రైతుల్ని ప్రోత్సహించాలి. ఆధార్‌ అథెంటికేషన్‌ చేసి, ఎరువులు సరఫరా చేయాలి’ అని చెప్పారు.


లాభదాయక పంటలకు ప్రోత్సహం

ఈ నెల 11న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న ‘ధన-ధాన్య కృషి యోజన’ కింద లాభదాయక పంటలను ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పట్టు పరిశ్రమ విషయంలో బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారం తీసుకోవాలన్నారు. హెచ్‌డీ బర్లీ పొగాకును రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా చూడాలన్నారు. నాలుగు జిల్లాల్లో బర్లీ పొగాకుకు క్రాప్‌ హాలిడే ప్రకటించాలని సూచించారు. ఉల్లి, టమాటా, మిర్చి, మామిడి పంటలకు ధరలు తగ్గకుండా ప్రణాళికలు వేసుకోవాలని చెప్పారు. కాఫీ గింజలకు సోకిన బెర్రీబోరర్‌ తెగులు నివారణకు జీవామృతం వినియోగించాలని, రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా జీలుగు ఉత్పత్తులను సీఎం పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని ఆయన రుచిచూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. వెదురు ఉత్పత్తులతో గిరిజన రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను పరిశీలించాలన్నారు. 2025-26లో వివిధ పంటలకు మద్దతు ధరలను ప్రకటిస్తూ పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. నాణ్యమైన పట్టుగూళ్లతో తయారు చేసిన ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు.

Updated Date - Oct 10 , 2025 | 06:22 AM