Share News

Irrigation Department: గోదావరి మళ్లించాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:58 AM

గోదావరి.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఏటా గోదావరి వరద నీరు వృథాగా పోతోంది. వేలాది టీఎంసీలు సముద్రంలో కలిసి పోతున్నాయి.

Irrigation Department: గోదావరి మళ్లించాలి

  • ఏటా గోదావరి వరద నీరు వృథా

  • వేల టీఎంసీలు సముద్రంలోకి

  • ఈ ఏడాది 1400 టీఎంసీలు

  • గత నాలుగేళ్లలో 15,680 టీఎంసీల వృథా

  • పోలవరం సామర్థ్యం 190 టీఎంసీలు

  • ప్రాజెక్టు పూర్తయినా ఇంకా మిగులే

  • సద్వినియోగం చేసుకుంటే ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదంటున్న నిపుణులు

  • 1986లో అతి భారీ వరద

  • ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 35,06,380 క్యూసెక్కులు సముద్రంలోకి

  • ఒక్క రోజే 302 టీఎంసీలు వృథా

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఏటా గోదావరి వరద నీరు వృథాగా పోతోంది. వేలాది టీఎంసీలు సముద్రంలో కలిసి పోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా ఇదే పరిస్థితి ఉంటుంది. వృథాగా పోతున్న ఈ వరద నీటిని తాగు, సాగు అవసరాలకు సద్వినియోగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో వరదలు తగ్గుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మిగులు జలాలను వాడుకోవడం వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా వరదల సమయంలో దాదాపు 2 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుండగా.. మరోవైపు గోదావరి జిల్లాల్లో ఇంకా లక్షల ఎకరాల భూమి మెట్టగానే ఉంది. బోర్లు, వర్షాధారంతోనే సాగు చేస్తున్నారు. వందల గ్రామాలు, కొన్ని పట్టణాలకు తాగడానికి గోదావరి నీరు అందడం లేదు. బోరు నీరు తాగుతున్నారు. ప్రస్తుతం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ కెపాసీటీ 3 టీఎంసీలు. బ్యారేజీ నీటిమట్టం 11 అడుగులు. సాధారణంగా వరదల సమయంలోనే ఈ మేరకు నిల్వ ఉంటుంది. ధవళేశ్వరం సర్కిల్‌లోని తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ డెల్టాల్లో సుమారు 10 లక్షల ఎకరాల సాగు, తాగునీరు, పారి శ్రామిక, చేపల చెరువుల అవసరాలకు ఒక పంట సీజన్‌కు దాదాపు 110 టీఎంసీల నీరు కావాలి.

Untitled-2 copy.jpg


గోదావరి వరదతో ఖరీఫ్‌ సీజన్‌లో సరిపడా నీరున్నా రబీ సీజన్‌కు ఉండడం లేదు. సీలేరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ దాటి వెళ్లిన నీటిని ఉపయోగించడం చాలా తక్కువ. ఎందుకంటే సముద్రం ఆటుపోటుల వల్ల గోదావరి పాయలలోకి సముద్రపు ఉప్పునీరు రావడం వల్ల అవి వినియోగానికి పనికిరావు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి డెల్టా కాలువల ద్వారా పంపిన నీటినే ప్రజలు వినియోగిస్తారు.

1986లో అతిపెద్ద వరద

1953 నుంచి వరద ప్రవాహాన్ని లెక్కిస్తున్నారు. 1953 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 22.75 అడుగులకు చేరడంతో పాటు 30, 03,100 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోయింది. అప్పట్లో కోనసీమతో పాటు బ్యారేజీ దిగువన అనేక గండ్లు పడ్డాయి. ఈ వరదను ప్రాతిపదికగా తీసుకుని ఏటిగట్లు పటిష్ఠం చేశారు. 1986లో గోదావరికి అతిపెద్ద వరద వచ్చింది. ఆ ఏడాది ఆగస్టు 16వ తేదీన ఏకంగా బ్యారేజీ నీటిమట్టం 24.55 అడుగులకు చేరడంతో పాటు 35,06,380 క్యూసెక్కుల వరద వచ్చింది. క్యూసెక్కు అంటే సెకన్‌కు వరదం ప్రవాహం. అప్పట్లో బ్యారేజీ నుంచి సెకన్‌కు 35,06,380 క్యూసెక్కుల నీరు ప్రవహించినట్టు లెక్క. ఆ ఒక్క రోజునే 302.92 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. అప్పట్లో కూడా గండ్లు పడ్డాయి. ఈ వరదను ప్రాతిపదికగా తీసుకుని అప్పటికి 5 మీటర్ల ఎత్తు ఉన్న ఏటిగట్లను 7 మీటర్లకు పెంచారు. గోదావరికి సుమారు 420 కిలోమీటర్ల ఏటిగట్టు ఉండగా.. రాజోలు, పి.గన్నవరం మండలాలు, ఇతర ప్రాంతాల్లో సుమారు 30 కిలోమీటర్ల గట్టు ఎత్తు చేయలేదు. ఇది ఇప్పటికీ సమస్యగానే ఉంది. ఆ తర్వాత ఇంత పెద్ద వరద ఇప్పటి వరకూ రాలేదు. 2022 జూలై 17న నీటిమట్టం 21.70 అడుగులకు చేరడంతో పాటు బ్యారేజీ నుంచి 25,80,963 క్యూసెక్కుల వరద సముద్రంలోకి పోయింది. 2009 ఆగస్టు 30న అతితక్కువగా 3,78,257 క్యూసెక్కుల వరద నమోదైంది. అప్పుడు నీటిమట్టం 9.90 అడుగులు మాత్రమే నమోదైంది.


21 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక

1953 నుంచి 2024 సెప్టెంబరు వరకూ మొత్తం 21 సార్లు పెద్ద వరదలు వచ్చాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 1954లో మినహా 1953 నుంచి 1959 వరకూ వరుసగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయిలో వరదలు వచ్చాయి. 26 సార్లు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఐదుసార్లు మొదటి ప్రమాద హెచ్చరిక వరకే వరద వచ్చింది. 18 సార్లు ఏ విధమైన హెచ్చరికలు జారీ చేయకుండానే సాధారణ వరద వచ్చి వెళ్లిపోయింది.


నాలుగేళ్లలో 15,680 టీఎంసీల వృఽథా

ఏటా జూన్‌ నుంచి మే నెల వరకూ వాటర్‌ ఇయర్‌ అంటారు. కానీ సాధారణంగా జూన్‌ నుంచి డిసెంబరు వరకే గోదావరికి నీరు ఉంటుంది. ఏటా వేల టీఎంసీల నీరు వృఽథా అవుతోంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 1400 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. 2021లో 2,493 టీఎంసీలు, 2022లో 6,246 టీఎంసీలు, 2023లో 2,821 టీఎంసీలు, 2024లో 4120 టీఎంసీలు కలిపి.. ఆ నాలుగేళ్లలో 15,680 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలైంది. ఇరిగేషన్‌ అధికారుల లెక్క ప్రకారం... ప్రతీ 4 సంవత్సరాలకు 20 లక్షల క్యూసెక్కులకు మించిన వరద, ప్రతీ 10 సంవత్సరాలకు 25 లక్షలకు మించిన వరద వస్తుంది. కానీ వాతావరణ కలుషితం, ఆక్రమణల వల్ల ఈ లెక్క తప్పినట్టు కనిపిస్తోంది. ఒక్కోసారి అధికంగా వరద వచ్చేస్తోంది.


హెచ్చరికలు ఇలా..

బ్యారేజీ వద్ద నీటిమట్టం, మిగులు జలాల స్థాయిని బట్టి హెచ్చరికలు జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరినా, 10 లక్షల క్యూసెక్కులు మిగులు జలాలు ఉన్నా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13.75 అడుగులు నీటిమట్టం ఉన్నా, 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు ఉన్నా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 17.75 అడుగులకు నీటిమట్టం చేరినా, 15 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు ఉన్నా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక అనేది చాలా ప్రమాదకర స్థాయి హెచ్చరిక.


  • ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా వరద సమయంలో దాదాపు 2 వేల టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు 20 వరకూ 1400 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. అంతకుముందు నాలుగేళ్లలో 15,680 టీఎంసీలు వృథా అయ్యాయి.

  • నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ 190 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తయినా ఇంకా వేల టీఎంసీల నీరు సముద్రం పాలు కావాల్సిందే. ఈ నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాల కోసం గోదావరి జలాలను వాడుకుంటే అభ్యంతరాలు ఎందుకని నిపుణులు అంటున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 05:00 AM