Massive Rally: ఆర్డీటీకి మద్దతుగా పొలికేక
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:35 AM
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డీటీ పరిరక్షణ కోసం అనంతపురం నగరంలో..
ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతలో నిరసన
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేయాలని డిమాండ్
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డీటీ పరిరక్షణ కోసం అనంతపురం నగరంలో ‘పొలికేక’ పేరిట సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు, కళాకారులు తరలివచ్చి నగరంలో కదంతొక్కారు. ఆర్డీటీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) అనుమతిని రెన్యువల్ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పొలికేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ శివనారాయణ శర్మకు వారు వినతిపత్రం సమర్పించారు.