Share News

Promotions Boost Panchayat Staff: పంచాయతీరాజ్‌లో పదోన్నతుల జాతర

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:01 AM

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతుల జాతర నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేల సంఖ్యలో..

Promotions Boost Panchayat Staff: పంచాయతీరాజ్‌లో పదోన్నతుల జాతర

  • అన్ని కేడర్లలో కలిపి 10 వేల మందికి ప్రమోషన్లు

  • ఇప్పటికే 6 వేల మందికి పదోన్నతి

  • గ్రామ సచివాలయాల్లోకి వెళ్లేఇంకో 4 వేల మందికి కూడా

  • పాలనా సంస్కరణలు చేపట్టడం వల్లే!

  • సిబ్బందిపై అభియోగాల పరిష్కారానికివినూత్నంగా అదాలత్‌లు

  • అక్కడికక్కడే జరిమానాలు..

  • వెంటనే పదోన్నతులకు లైన్‌ క్లియర్‌

  • సీఎం, డిప్యూటీ సీఎంకు ఉద్యోగుల కృతజ్ఞతలు

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతుల జాతర నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతున్నారు. అధికారులు, ఉద్యోగులపై ఏళ్ల తరబడి చిన్నపాటి ఆరోపణలు కొనసాగుతుండడం.. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషనల్‌ కమిటీ (డీపీసీ) భేటీలు నిర్వహించకపోవడం, ఎంపీడీవోలకు గతంలో ప్రమోషన్‌ చానల్‌ లేకపోవడంతో పదోన్నతులు లేక ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు వారిలో ఒకేసారి 6 వేల మందికి పైగా పదోన్నతులు లభించాయి. గ్రామ/వార్డు సచివాలయ శాఖ సిబ్బందిని కూడా ఈ శాఖ నుంచే తీసుకుంటుండడంతో సుమారు మరో 4 వేల మంది పంచాయతీరాజ్‌ సిబ్బందికి పదోన్నతులు దక్కనున్నాయి. అంటే 10 వేల మందికి పంచాయతీరాజ్‌లో పదోన్నతులు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామ సచివాలయాల్లో చేపట్టిన పరిపాలనా సంస్కరణల వల్లే ఇది సాధ్యపడింది.

పంచాయతీరాజ్‌ సంస్కరణలతో పెరిగిన పోస్టులు...

రాష్ట్ర పంచాయతీరాజ్‌లో స్వాతంత్ర్యానంతరం ఎప్పుడు చేపట్టని సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో అధికారులు రాత్రింబవళ్లూ కృషి చేసి వీటికి రూపకల్పన చేశారు. ఈ శాఖలో డీపీవో, జడ్పీ, గ్రామ పంచాయతీలు.. ఇలా మూడు రకాలుగా ఉన్న వ్యవస్థలను ఏకం చేయడం ద్వారా పాలనను సులువు చేశారు. దీంతో పాటు గ్రామ సచివాలయాల్లో పంచాయతీరాజ్‌ సిబ్బంది కీలకం కావడంతో మరిన్ని అవకాశాలు ఈ శాఖ ఉద్యోగులకు దక్కాయి. ఎంపీడీవోలు పదోన్నతులు పొంది డీఎల్‌డీవోలుగా మారినప్పటికీ గత ప్రభుత్వం వారి సేవలు వినియోగించుకోవడంలో విఫలమైంది. తాజాగా కూటమి ప్రభుత్వం వారి సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా కృష్ణతేజ, ఉపముఖ్యమంత్రి ఓఎ్‌సడీగా ఉన్న అదనపు కార్యదర్శి వెంకటకృష్ణ, ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఈ శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. సుమారు లక్ష మందికి పైగా పనిచేసే పంచాయతీరాజ్‌ శాఖలో ఇప్పటికే 6 వేల మందికి పదోన్నతులు దక్కాయి. 53 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించి డీఎల్‌డీవోలుగా నియమించారు. వీరికి ఆర్‌డీవో తరహాలో విశేష అధికారాలు కల్పించారు. సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పించి సుమారు 300 మందిని ఎంపీడీవోలుగా నియమించారు. గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులు సుమారు 3 వేల మందికి పదోన్నతులు లభించాయి. అదే విధంగా సచివాలయాల్లో పనిచేసే 2 వేల మందికిపైగా గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు దక్కాయి. ఇలా పంచాయతీరాజ్‌లో అన్నీ కేటగిరీలకు సంబంధించి సుమారు 6 వేల మంది దాకా పదోన్నతులు పొందారు. గ్రామ సచివాలయాల్లో సంస్కరణలు ప్రారంభించడంతో అక్కడ కూడా పంచాయతీరాజ్‌ సిబ్బందికి పోస్టులు దక్కనున్నాయి. గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్‌శాఖ, గ్రామ సచివాలయాల్లో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించడంతో భారీగా పదోన్నతులకు అవకాశమేర్పడింది.


OSD చొరవ, కమిషనర్‌ కృషితో..

ఉపముఖ్యమంత్రి ఓ‌ఎస్‌డీ వెంకటకృష్ణ పంచాయతీ రాజ్‌శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారి. శాఖలో ఏళ్ల తరబడి పదోన్నతులు లేక.. వీడీవోలుగా చేరిన వారు వీడీవోలుగానే రిటైరవుతుండడం చూసిన ఆయన.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా గ్రామీణాభివృద్ధిని పరిగెత్తించాలని భావించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు చెప్పి ఒప్పించారు. పంచాయతీరాజ్‌ శాఖలో ఉన్న చట్టాలు, ఉత్తర్వులను అధ్యయనం చేసిన ఆయన పకడ్బందీ ప్రణాళికతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఉద్యోగు సంఘాలతో, అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు. కేరళ నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు. ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వారి వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ప్రతి రోజూ ఏదో ఒక కేడర్‌ ఉద్యోగులకు పదోన్నతుల డీపీసీ సమావేశం జరుగుతోంది. ఒక్క పైసా చేతులు మారకుండా 10 వేల మంది పదోన్నతులివ్వడంతో హర్షం వ్యక్తమవుతోంది.


ఆ ఉద్యోగులకు ఊరట...

పంచాయతీరాజ్‌శాఖలో ఎన్నో దశాబ్దాలుగా చిన్నపాటి ఆరోపణలతో అభియోగాలు నమోదైపదోన్నతులకు నోచుకోని ఉద్యోగులు చాలా మందే ఉన్నారు. వారు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ చుట్టూ, రాష్ట్ర సచివాయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెలల తరబడి తిరిగినా ఆరోపణలు క్లియర్‌ కావడం లేదు. ఇవి పెద్ద తప్పులు కాకపోయినా ఈ అభియోగాలు వారి ఉద్యోగోన్నతికి ఆటంకంగా ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు కృష్ణతేజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాల్లోనే పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు అదాలత్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ అధికారులు జిల్లాలకు వెళ్లి ఈ అదాలత్‌ నిర్వహిస్తారు.

ఆయా సిబ్బందిపై ఉన్న అభియోగాలను అక్కడికక్కడే పరిష్కరించి వారికి జరిమానాలు విధిస్తారు. వెంటనే వారి పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ చేస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 19న గుంటూరు జిల్లాలో అదాలత్‌ నిర్వహించాలని కమిషనర్‌ నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటగా కమిషనరేట్‌ను జిల్లాలకు తరలించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుండడంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల సంక్షేమ సంఘం నేతలు కేఎస్‌ వరప్రసాద్‌, కేఎన్‌వీ ప్రసాద్‌, డి.వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రి కావడం ఉద్యోగులకు స్వర్ణయుగంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రికి, ఓఎ్‌సడీ వెంకటకృష్ణ, ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజలకు ధన్యవాదాలు తెలియజేశారు. శాఖ అధికారులందరూ కృషి చేయడం వల్లే తమకు పదోన్నతులు దక్కాయన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 10:48 AM