Share News

ACB Raids: ఓ ఊరినే దత్తత తీసుకునేంత..

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:21 AM

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో పెద్దగా నగదు పట్టుబడకపోయినా.. భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ACB Raids: ఓ ఊరినే దత్తత తీసుకునేంత..

  • చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భారీగా అక్రమాలు

  • ఏసీబీ సోదాల్లో బట్టబయలు

హిందూపురం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో పెద్దగా నగదు పట్టుబడకపోయినా.. భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఇక్కడ చేతులు మారిన సొమ్ముతో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయొచ్చు..’ అంటూ ఏసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఏసీబీ సోదాలు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై.. గురువారం ఉదయం 9 గంటలకు వరకూ కొనసాగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ అధికారులు కొంత మంది తమ అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఓ ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా కొందరికి నెలవారీ మామూళ్లను ఫోన్‌పే ద్వారా పంపినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల డ్రైవర్లకు సైతం నెలవారీ పంపకాలు జరిగినట్లు గుర్తించారు. చిలమత్తూరు మండలంలోని కొందరు ప్రజాసంఘాల నాయకులకు కూడా క్రమం తప్పకుండా మామూళ్లు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఈ వివరాలను అనధికారికంగా వెల్లడించిన ఏసీబీ అధికారులు, ఆ చిట్టాను మాత్రం బహిర్గతం చేయలేదు. మామూళ్లను ఫోన్‌పే ద్వారా చెల్లించిన ఆ ప్రైవేట్‌ వ్యక్తి.. ఆ జాబితాను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారికి పంపించారు. ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించిందనే జాబితా ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసే అధికారులు తమ దందా కోసం ఓ ప్రైవేట్‌ వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. కొంత మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఆ వ్యక్తికి నగదు, ఫోన్‌పే రూపంలో సొమ్ము పంపినట్లు తెలుస్తోంది. చిన్న మొత్తాలు మాత్రమే ఫోన్‌పేలో వెళ్లాయని, పెద్ద మొత్తం ఉన్నప్పుడు అధికారులే నేరుగా డీల్‌ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 20 గంటలు జరిగిన సోదాల్లో రికార్డులను పరిశీలించారు.


ఓ ఊరినే దత్తత తీసుకోవచ్చు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన దందాలో కొంతే బహిర్గతమైందని, అక్కడ భారీగా అవినీతి జరిగిందనే విషయం ఓ అధికారి వ్యాఖ్యలను బట్టి అర్థమౌతోంది. ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం కార్యాలయంలోకి ప్రవేశించగానే అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆన్‌లైన్‌ ముడుపుల వ్యవహారం బయటపడింది. ప్రైవేట్‌ వ్యక్తి ఫోన్‌పే లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.

విశాఖలో కొనసాగిన ఏసీబీ తనిఖీలు

విశాఖపట్నం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లాలో ఏసీబీ అధికారులు రెండో రోజు గురువారం కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు కొనసాగించారు. సూపర్‌బజార్‌, మధురవాడ, పెదగంట్యాడ కార్యాలయాల్లో బుధవారం తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అవే కార్యాలయాల్లో గురువారం రికార్డులు పరిశీలించారు. మధురవాడలో రికార్డ్‌ రూమ్‌కు ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి సీల్‌ వేశారు. గురువారం దానిని తీసి డాక్యుమెంట్లు పరిశీలించారు.

Updated Date - Nov 07 , 2025 | 04:22 AM