TTD Temple Funds: దేవదేవుడ్నే దోచేశారు
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:21 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో... తిరుమలలో పరకామణి చోరీ కేసు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం మాత్రమే కాదు, ఎన్నో అక్రమాలు జరిగాయి. టీటీడీ నిధులను పెద్దఎత్తున దుర్వినియోగం చేసి, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు...
గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు
ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాలపుట్ట
ఇప్పటికే పరకామణి, కల్తీ నెయ్యిపై విచారణ
ఇంకా టీటీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు
ఎన్నికలకు ఏడాది ముందు 3 వేల కోట్లతో హడావిడిగా పనులు.. కోట్లలో కమీషన్లు
మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి
రూ.400 శాలువా 1,334కు కొనుగోలు
శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం
శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలు
అన్నిటిపైనా దృష్టిపెట్టిన ప్రస్తుత పాలకమండలి
ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో... తిరుమలలో పరకామణి చోరీ కేసు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం మాత్రమే కాదు, ఎన్నో అక్రమాలు జరిగాయి. టీటీడీ నిధులను పెద్దఎత్తున దుర్వినియోగం చేసి, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.350-400 విలువ చేసే శాలువాలను ఏకంగా రూ.1,334కు కొనుగోలు చేయడం అవినీతికి పరాకాష్ఠ. అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చివరికి శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను బయటికి తీసేందుకు ప్రస్తుత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై విచారణ పూర్తయింది. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసిన ఘోరంలో కారకులైనవారు ఒక్కొక్కరూ విచారణకు హాజరవుతున్నారు. తిరుమలలో అక్రమాలు చోటు చేసుకోవడంపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించాయి. ఈ నేపథ్యంలో గత పాలక మండళ్ల కాలంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపై దృష్టిసారించారు. లోతుగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన వారిపై గట్టి చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడవచ్చని భావిస్తున్నారు.
గత ప్రభుత్వంలో భవనాలు, రోడ్లు, వసతి సముదాయాల నిర్మాణాలకు దాదాపు రూ.3 వేల కోట్లు టీటీడీ కేటాయించింది. అవసరం లేకపోయినా టీటీడీ పరిధిలో ఎన్నికలకు ముందు ఏడాది ఆగమేఘాలమీద చేపట్టారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కమీషన్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. టీటీడీలో సలహాదారులను నియమించి రూ.లక్షలు ముట్టజెప్పారు. ముఖ్యమైన విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తమవారిని నియమించి రూ.లక్షల్లో జీతాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వీరిని తొలగించింది.
నాసిరకం సరుకులు: టీటీడీ మార్కెటింగ్ విభాగంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. కమీషన్ల కోసం నాసిరకం ముడి సరుకులను కొనుగోళ్లు చేసినట్లు విజిలెన్స్ విభాగం కూడా నిర్ధారించింది. ఇప్పటికే ఇద్దరు అధికారులను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది. అలాగే శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం జరిగాయని తీవ్ర ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. దర్శనం, సేవా టికెట్ల కేటాయింపు వంటి వాటిల్లోనూ భారీగా అవినీతి జరిగిందనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో శ్రీవారి తులాభారంలోనూ సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని, స్వామికి చెందాల్సిన సొమ్మును కొట్టేశారంటూ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు చేశారు.