AP Govt: ముమ్మరంగా కుట్టుమిషన్ శిక్షణ
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:27 AM
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట ప్రారంభించిన కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో బీసీ మహిళలతో పాటు ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల...
బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 65 వేల మందికి ఉచితంగా..
ఇప్పటికే పూర్తి చేసుకున్న 27 వేల మంది
ఉచిత మిషన్ల కోసం ఎదురుచూపులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట ప్రారంభించిన కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో బీసీ మహిళలతో పాటు ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల ద్వారా 65,987 మంది మహిళలకు శిక్షణ అందిస్తున్నారు. వీరిలో ఇప్పటికే 27,096 మంది శిక్షణ పూర్తి చేసుకుని రెడీమేడ్ దుస్తులు కుట్టే నైపుణ్యం సాధించారు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంతటి భారీ స్థాయిలో కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చిన సందర్భం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది బీసీ, ఈబీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి మిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 3,43,413 మంది శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 680 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 1,326 బ్యాచ్‌ల ద్వారా మొదటగా 65,987 మందికి శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రతి జిల్లాలో మండల/మున్సిపాలిటీల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిషన్లు, ఇతర సామగ్రితో పాటు ఆయా సంస్థల ద్వారా అనుభవజ్ఞులైన ట్రైనర్లను నియమించి ప్రాథమిక కుట్టు శిక్షణ ఇస్తున్నారు.
అత్యంత పారదర్శకతతో శిక్షణ
గతంలో పలు శిక్షణా కార్యక్రమాలు మొక్కుబడిగా సాగిన నేపథ్యంలో కుట్టు మిషన్ శిక్షణను పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించారు. శిక్షణ పొందే మహిళలను ఏపీఎ్‌ఫఎ్‌సఎస్ ద్వారా ప్రత్యేక ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌లో నమోదు చేసి టీపీఎంఎంఎస్ వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచారు. మొదటిసారిగా ప్రతిరోజు రెండుసార్లు సెంటర్‌కు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు హాజరు తీసుకున్నారు. ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లు ప్రతివారం శిక్షణా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించి, పనితీరు వివరాలను సేకరిస్తూ తగు ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా ఇన్, ఔట్ కాలాన్ని లెక్కించి శిక్షణా సంస్థలకు ఫీజు చెల్లిస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
కుట్టుమిషన్ శిక్షణ సెంటర్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు సవిత, ఇతర మంత్రులు సందర్శించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శిక్షణ పొందిన ప్రతి మహిళకు కుట్టుమిషన్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొనడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. చివరకు శిక్షణకు హాజరయ్యే వారికి మాత్రమే మిషన్లు ఇస్తామని నిబంధనలు కఠినం చేయడంతో వాస్తవంగా శిక్షణ పొంది జీవనభృతి పొందాలనుకున్న వారు హాజరవుతున్నారు. దరఖాస్తు చేసిన వారందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వడపోతతో ఎంపిక చేస్తున్నారు. శిక్షణ కోసం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం సిఫారసులు చేస్తుండటంతో డిమాండ్ పెరిగింది. పీ4 ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు ప్రాధాన్యమిస్తున్నారు.
విశ్వకర్మ యోజనలో లేని కుట్టుమిషన్ శిక్షణ
వృత్తిపరమైన శిక్షణ అందించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పీఎం విశ్వకర్మ యోజన పథకంలో కుట్టుమిషన్ శిక్షణ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణకు విపరీత ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో.. విడతల వారీగా అందరికీ శిక్షణ అందించి మిషన్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు.
మూడు నెలలైనా.. విడుదల కాని నిధులు
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుట్టుమిషన్ శిక్షణకు నిధుల సమస్య వెంటాడుతోంది. పథకం ప్రారంభించి మూడు నెలల పైబడినా శిక్షణకు అవసరమైన నిధులు మాత్రం విడుదల కాలేదు. బీసీ సంక్షేమశాఖ, ఈడబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినా.. ఏవేవో కొర్రీలు వేసి ఒక్క పైసా విడుదల చేయడం లేదు. సజావుగా సాగుతున్న ఈ పథకం ముందుకు సాగాలంటే ఈ సమస్య తీర్చాల్సి ఉంది. అధికారులు, శిక్షణా సంస్థలు పదేపదే ఆర్థిక శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నా.. ఫైల్ ముందుకు కదలడం లేదంటున్నారు. దీంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మిషన్లు కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసి.. కుట్టుమిషన్ల పంపిణీకి సహకరించాలని కోరుతున్నారు.