Share News

Jala Jeevan Mission: రూ.2 కోట్ల విలువైన పైపులు ఆహుతి

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:38 AM

ఇంటింటికీ కొళాయి పథకం కోసం తెప్పించి, నిల్వ చేసిన పైపులకు మంటలు అంటుకోవడంతో రూ.2.04 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

 Jala Jeevan Mission: రూ.2 కోట్ల విలువైన పైపులు ఆహుతి

  • శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో అగ్నిప్రమాదం

  • వైసీపీ హయాంలో ఆగిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు

  • బిల్లులు రాక.. కాంట్రాక్టు రద్దు చేసుకున్న సంస్థ

  • అప్పట్లో కొన్న పైపులను నిర్లక్ష్యంగా వదిలేసిన అధికారులు

మడకశిర, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటింటికీ కొళాయి పథకం కోసం తెప్పించి, నిల్వ చేసిన పైపులకు మంటలు అంటుకోవడంతో రూ.2.04 కోట్ల మేర నష్టం వాటిల్లింది. యార్డు ఆవరణలో శుభ్రం చేసే క్రమంలో పిచ్చి మొక్కలకు సిబ్బంది నిప్పు పెట్టారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మంటలు ఎగసి పైపులు అంటుకున్నాయి. పావగడ, హిందూపురం నుంచి ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా 80 శాతం పైపులు ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప కాలనీల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ట్రైనీ డీఎస్పీ పావని ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మడకశిరలో గత వైసీపీ ప్రభుత్వంలో జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద రూ.34 కోట్లతో పనులు చేపట్టారు.


జీపీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఈ కాంట్రాక్టు పనులను దక్కించుకుని ప్రారంభించింది. అయితే చేసిన పనులకు ఒప్పందం ప్రకారం బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టు సంస్థ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వం కొంత డబ్బు మంజూరు చేసింది. మిగిలిన పనుల కోసం కాంట్రాక్టు సంస్థ రూ.2.45 కోట్లతో పైప్‌లు కొనుగోలు చేసి, మార్కెట్‌ యార్డులో నిల్వ చేసింది. ఆ తర్వాత చేసిన పనులకూ వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థ 2023లో కాంట్రాక్టును రద్దు చేసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు లేఖ రాసింది. ఆ సమయంలో జిల్లా అధికారులు మిగిలిన మెటీరియల్‌ను పరిశీలించి, స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంగా వదిలేశారు.

Updated Date - Mar 16 , 2025 | 03:38 AM