Share News

Prakasam District: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:58 AM

ప్రకాశం జిల్లాలోని ఓ పొగాకు కంపెనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Prakasam District: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

  • రూ.550 కోట్ల పొగాకు దగ్ధం

  • ప్రకాశం జిల్లాలో ఘటన

సింగరాయకొండ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని ఓ పొగాకు కంపెనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుద్ధి చేసి, ఎగుమతికి సిద్ధంగా ఉంచిన 11 మిలియన్‌ కేజీల పొగాకు అగ్నికి ఆహుతయింది. వివరాలు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి పంచాయతీ పరిధిలో బీకే త్రెషర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉంది. దీన్ని 2012 నుంచి గాడ్‌ ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా(జీపీఐ) లిమిటెడ్‌ కంపెనీ అద్దె ప్రాతిపదికన తీసుకొని వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుంది. ఎగుమతికి సిద్ధంగా ఉన్న... కోటి 10 లక్షల(11 మిలియన్‌) కేజీల పొగాకు ఉంచిన ఏ, బీ ఏసీ గోదాముల నుంచి ఒక్కసారిగా భారీగా అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు, టంగుటూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రూ.550 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జీపీ ఐ కంపెనీ జీఎం ప్రభాకర్‌రావు పోలీసులకు తెలిపారు. సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 03:59 AM