ఆత్మకూరులో పట్టపగలు భారీ చోరీ
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:46 PM
ఆత్మకూరు పట్టణంలో సోమవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. పట్టణంలోని సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న తెలుగుగంగ పథకం ఏఈ శరభారెడ్డి సోమవారం తన విధి నిర్వహణలో భాగంగా నంద్యాల కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్ హాజరయ్యేందుకు వెళ్లారు.
60 తులాల బంగారు, రూ.27 లక్షల నగదు అపహరణ
రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు
ఆత్మకూరు, జూన 23(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణంలో సోమవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. పట్టణంలోని సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న తెలుగుగంగ పథకం ఏఈ శరభారెడ్డి సోమవారం తన విధి నిర్వహణలో భాగంగా నంద్యాల కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్ హాజరయ్యేందుకు వెళ్లారు. ఇటీవల ఆయన కుమార్తె వివాహం జరగడంతో పోస్టు వెడ్డింగ్ షూట్ కోసం కుటుంబసభభ్యలు నల్లకాల్వ సమీపంలోని వైఎస్‌ఆర్ స్మృతివనానికి వెళ్లారు. ఇదే అదనుగా దుండగులు ఇంటి తలుపు గడియ స్ర్కూలను తీసి దర్జాగా లోపలికి ప్రవేశించారు. బెడ్‌రూమ్‌లోని బీరువాకు కూడా తాళాలు వేయకపోవడంతో అందులో ఉన్న సుమారు 60తులాల బంగారుతో పాటు పక్కనే కబోర్డులో సూట్‌కేసులో ఉంచిన రూ.27లక్షల నగదును అపహరించాడు. మధ్యాహ్నం 2గంటల సమయంలో తిరిగి వచ్చిన ఏఈ శరభారెడ్డి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. ఆత్మకూరు అర్బన సీఐ రాము సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లోని పలు సీసీ కెమెరాల పుటేజీలను సేకరించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారం ఇవ్వడంతో నంద్యాల సీసీఎస్ సీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీరువాకు తాళాలు వేయకుండా, పక్కనే ఉన్న కబోర్డులోనే భారీగా నగదు ఉంచటంతో మిగిలిన రూ.4.5లక్షల నగదు, ఇతర వెండి ఆభరణాల జోలికి వెళ్లకుండా దొంగలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా డాగ్ స్క్వాడ్స్ బృందాల తనిఖీల్లో దుండగులు ఇంటి సమీపంలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి వైపు వెళ్లినట్లు పసిగట్టాయి. ఆ దిశగా పోలీసు బృందాలు గస్తీ మరింత ముమ్మరం చేశారు.