Sattenapalli Irregularities: అంబటీ..ఇదేంటి
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:01 AM
గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగింది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా భారీ ఎత్తున అక్రమార్జనకు తెగబడ్డారు.
మాజీ మంత్రిపై భారీ అవినీతి ఆరోపణలు
జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు
ఎకరం 10 లక్షలకు కొని..
ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మకం
రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్‌కు ఎకరాకు 5 లక్షలు వసూలు
ముగ్గురాయి వ్యాపారుల నుంచి
ఐదేళ్లలో రూ.10 కోట్లు స్వాహా
విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు రూ.7 లక్షలకు అమ్మకం
విజిలెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగింది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా భారీ ఎత్తున అక్రమార్జనకు తెగబడ్డారు. రియల్ ఎస్టేట్ నుంచి ఉద్యోగుల బదిలీల వరకూ... కోడి పందేల నుంచి పేకాట శిబిరాల వరకూ ప్రతిదాంట్లోనూ వసూళ్ల పర్వం నడిపించారు. చివరకు సొంత పార్టీ నేతలు కూడా తనకు కప్పం కట్టాలన్న నిబంధన విధించారు. ముగ్గురాయి వ్యాపారుల ముక్కుపిండి మరీ రూ.కోట్లు వసూలు చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నా, చెరువులో మట్టి తవ్వు కోవాలన్నా ముందు ఆయన దర్శనం చేసుకొని, ముడుపులు సమర్పించుకోవాల్సిందే. ఇక జగనన్న కాలనీల కోసం ఎకరం రూ.10 లక్షలకు కొనుగోలు చేసి.. అదే భూమిని ప్రభుత్వానికి ఎకరం రూ.30 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆయన వేధింపులు, బెదిరింపులకు తాళలేక సొంత పార్టీ నాయకుడొకరు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వం ఉండగానే అంబటి అవినీతి బాగోతంపై అనేక ఫిర్యాదులొచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు రావడంతో కదలిక ప్రారంభమైంది. మాజీ మంత్రి అవినీతి వ్యవహారం తేల్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఇవీ ఆరోపణలు...
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగింది. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. ఈ వ్యవహారం అంతా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చక్కబెట్టారు. రియల్ ఎస్టేట్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్‌కు ఎకరానికి రూ.5 లక్షలు, అనుమతి లేకుండా ప్లాట్లు అమ్ముకోవడానికి ఎకరాకు రూ.10 లక్షలు వసూలు చేశారు.
మంగళగిరికి చెందిన రియల్ వ్యాపారి స్థానిక వైసీపీ నేతతో కలిసి ఐదు ఎకరాల్లో ప్లాట్లు వేశారు. అయితే ముందుగా మంత్రిని కలవకపోవడంతో ప్లాట్లకు వేసిన సరిహద్దు రాళ్లు తొలగించాలని మునిసిపల్ అధికారులకు పురమాయించారు. దీంతో సొంతపార్టీ నేత కూడా ఎకరాకు రూ.7లక్షల లెక్కన కప్పం కట్టారు.
అంబటి ప్రధాన అనుచరుడు వందల కోట్లు విలువచేసే రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఆయనకు ఏటా రూ.కోట్లల్లో ముడుపులు అందాయి. కోడి పందేలు,పేకాట శిబిరాలు కూడా ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. జగనన్న కాలనీల్లో మట్టి తోలకంలో మంత్రి వాటా 10 శాతం పైమాటే.
సత్తెనపల్లిలో ఏర్పాటుచేసిన నాలుగు బార్,రెస్టారెంట్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి వ్యాపారం చేసినందుకు లాభాల్లో మంత్రికి 33శాతం వాటా అందింది. ముగ్గురాయి అక్రమ తవ్వకాల ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.10 కోట్ల వరకూ స్వాహా చేశారు.
పోలీసుల బదిలీ కోసం గుంటూరులో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
అంబటి అల్లుడి కనుసన్నల్లో జరిగిన మట్టి తవ్వకాల్లో రూ.కోట్లు చేతులు మారాయి. నియోజకవర్గంలోని రెండు మండలాల్లో భారీగా గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకున్నారు.