కర్ణాటకలో నాలుగే.. ఏపీలో 12కి కొంటున్నాం: శ్రీనివాసరెడ్డి
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:12 AM
మామిడి రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర గురించి అవగాహన లేని జగన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ...
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): మామిడి రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర గురించి అవగాహన లేని జగన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ‘కూటమి ప్రభుత్వం తోతాపురి మామిడిని కిలో రూ.12కి కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇందులో రూ.8 ఫ్యాక్టరీలు, మిగిలిన రూ.4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. జగన్ కర్ణాటకలో మామిడి కిలో రూ.16కి కొనుగోలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కర్ణాటకలోని మండీల్లో కిలో రూ.2, ఫ్యాక్టరీల్లో రూ.4కి కొనుగోలు చేస్తున్నారు’ అని వివరించారు.