Farmer Losses: మార్క్‌ఫెడ్ మాయ
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:07 AM
వరి, మిర్చి పండించిన రైతులు తమకు కనీస మద్దతు ధర లభించడం లేదని, నానా తిప్పలు పడుతున్నామని వాపోతున్న విషయం తెలిసిందే. అయితే..
తెలంగాణలో ఒకలా.. రాష్ట్రంలో మరోవిధంగా
పొరుగు రాష్ట్రంలో కొనుగోళ్లు
ఏపీలో జాడలేని కేంద్రాలు
బహిరంగ మార్కెట్‌లో మోసాలు
కందులు, శనగలు, మొక్కజొన్న, పెసలకు భారీగా పడిపోయిన ధర
రేయనక, పగలనక చెమటోడ్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెసలు, శనగలు, కందులు, మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర కూడా లభించక కుంగిపోతున్నారు. మరోవైపు రైతుల నుంచి సమయానికి కొనుగోలు చేయాల్సిన మార్క్‌ఫెడ్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని రైతులు వాపోతున్నారు.
(కంచికచర్ల-ఆంధ్రజ్యోతి)
వరి, మిర్చి పండించిన రైతులు తమకు కనీస మద్దతు ధర లభించడం లేదని, నానా తిప్పలు పడుతున్నామని వాపోతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ జాబితాలో అపరాల రైతులు కూడా చేరారు. కందులు, శనగ, పెసర పంటలకు మద్దతు ధర లేక, బహిరంగ మార్కెట్‌లో కనీసం పెట్టుబడి సొమ్ము కూడా రాక తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన మార్క్‌ఫెడ్ కూడా ముఖం చాటేస్తోందని చెబుతున్నారు. అంతేకాదు, పొరుగు రాష్ట్రం తెలంగాణలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్.. ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదని వాపోతున్నారు. దీంతో పంటను కొనేవాళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
మూడేళ్లుగా మద్దతులేని పెసర
మూడు సంవత్సరాలుగా పెసర పంటకు మద్దతు ధర లభించడం లేదని రైతులు చెబుతున్నారు. ఎకరానికి రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు పెసర దిగుబడి వస్తోందని, సెప్టెంబరు మొదటి వారంలో పంట పూర్తిగా చేతికి అందిందని.. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.ఆరు వేలకు మించి ధర రావటం లేదని వాపోతున్నారు. ఈ ధర ఇచ్చేందుకు కూడా వ్యాపారులు అనేక కొర్రీలు వేస్తున్నారని చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.8,768 కాగా, వ్యాపారులు మాత్రం రెండు వేలు తగ్గించి కొంటున్నారు. దీంతో రైతులు తమ పంటలను శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డులు, ఇళ్లలో నిల్వ చేశారు. పంట చేతికి వచ్చి మూడు నెలలు కావస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవడంతో దిగాలు పడుతున్నారు. గత మూడేళ్లుగా మార్క్‌ఫెడ్ పెసలను కొనుగోలు చేయటం లేదు. గత ఏడాది కొంటామంటూ సీఎం యాప్‌లో పేర్లు నమోదు చేసుకోమన్నారు. రైతుల ఫోన్లకు మేసేజ్‌లు కూడా వచ్చాయి. చివరకు రైతులకు నిరాశే మిగిలింది. ఒక్క కిలో కూడా కొనలేదు.
తెగనమ్ముకుంటున్న మొక్కజొన్న
మొక్కజొన్నకు కౌలు కాకుండా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి ఖర్చయింది. దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చింది. గత నెల మొదటి వారం నుంచి పంట చేతికి రావటం ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.2,400. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం క్వింటా రూ.1,700 నుంచి రూ.1,800లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అదనంగా ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా క్వింటాకు రూ.ఆరేడు వందలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. మద్దతు ధర దక్కకపోవడంతో 20 క్వింటాళ్ల దిగుబడికి ఎకరానికి సగటున రూ.12 వేలు వంతున రైతులు నష్టపోతున్నారు. పక్కనే ఉన్న తెలంగాణాలో మొక్కజొన్న పంటను అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర క్వింటా రూ.2,400 ఇస్తున్నారు. ఎకరానికి గరిష్ఠంగా 25 క్వింటాళ్లు కొంటున్నారు.
కందికి మద్దతేదీ?
కంది సాగు సగటున నాలుగు క్వింటాళ్ల వంతున ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చింది. అప్పట్లో మద్దతు ధర రూ.7,550 ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.6,100కే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక, మార్క్‌ఫెడ్ అధికారులు 45 టన్నులు మాత్రమే కొన్నారు. ‘ఈ-క్రా్‌ప’లో కంది విస్తీర్ణం తక్కువగా నమోదైందని అధికారులు సాకులు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో రైతులు కందిలో అంతర పంటగా మొక్కజొన్న సాగుచేశారు. వ్యవసాయాధికారులు మాత్రం ఎకరంలో 20 శాతం కంది, 80 శాతం మొక్కజొన్నగా ఈ-క్రాప్‌లో నమోదు చేశారు. దీంతో రైతులు గత్యంతరం లేక 2 నెలల క్రితం క్వింటా రూ.5,800కు, గత నెలలో రూ.6,350కు విక్రయించారు.
విత్తనాలు 7 వేలు.. పంట 5 వేలు!
గత సీజన్‌లో శనగ మద్దతు ధర రూ.5,650కాగా, ఈ ఏడాది మార్చిలో పంట చేతికందే సమయంలో బహిరంగ మార్కెట్‌లో రూ.5,500 పలికింది. అంతకు ముందుటేడాది క్వింటా రూ.7,200కు అమ్మారు. ఈ ఏడాది మార్చి 17న అప్పటి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ విజయ సునీత, మార్క్‌ఫెడ్ డీఎం మల్లిక కంచికచర్ల యార్డుకు వచ్చి శనగలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా మార్క్‌ఫెడ్‌కు అమ్మేది లేదంటూ రైతులు తెగేసి చెప్పారు. ప్రభుత్వం.. రాయితీ విత్తనాల పేరిట రూ.7 వేలకు అమ్మిందని, పంటను మాత్రం రూ.5,650కు కొంటామనటం ఎంత వరకు సబబని నిలదీశారు. మార్క్‌ఫెడ్‌కు అమ్మకుండా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రైతులు కోరుతున్నారు.