మార్కెటింగ్ కోసమే మజుందార్ వ్యాఖ్యలు: Deputy Minister DK Shivakumar
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:00 AM
సొంత మార్కెటింగ్ కోసం బెంగళూరు నగరంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యలు చేస్తున్నవారు రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడే పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందారు అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
బెంగళూరులాంటి నగరం దేశంలో మరొకటి లేదు
బయోకాన్ ఎండీ కిరణ్ షా ట్వీట్‌పై మండిపడ్డ డీకే
బెంగళూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘సొంత మార్కెటింగ్ కోసం బెంగళూరు నగరంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యలు చేస్తున్నవారు రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడే పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందారు’’ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులో రహదారులు, పారిశుద్ధ్యం గురించి పోస్టు పెట్టిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్‌షాపై పరోక్షంగా ఆయన మండిపడ్డారు. విధానసౌధలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, స్టార్ట్‌పలు, పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించి దేశంలో బెంగళూరులాంటి నగరం మరొకటి లేదన్నారు. బెంగళూరు విషయమై ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా మాట్లాడేది లేదన్నారు. బెంగళూరులో 25 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారని, 2 లక్షల మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. కిరణ్ మజుందార్ షా ట్వీట్‌పై స్పందిస్తూ.. ఆమె దేశం, రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్లపై గుంతలను పూడ్చేందుకు శక్తికి మించి పనిచేశామని, రోజుకు వెయ్యి గుంతలు పూడ్చిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు.
ఏపీ భారీ రాయితీలు ఇస్తోంది
గూగుల్ ఏఐ హబ్ ఏపీతో ఒప్పందం చేసుకున్న విషయంపై స్పందిస్తూ.. ‘‘వారు ఏపీకి వెళతామంటే మేం వద్దని ఎలా చెబుతాం. ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోంది’’ అని డీకే శివకుమార్ అన్నారు. సింగపూర్ పారిశ్రామివేత్తలు త్వరలోనే వస్తున్నట్లు మంత్రులు ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే తనకు తెలిపారని చెప్పారు. ఎవరూ ఈ ప్రాంతాన్ని వదులుకోరని అన్నారు.