Share News

Police foiled a Maoist plan: ఉనికి కోసం వ్యూహం?

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రయం పొంది ఎవరో ఒక ప్రముఖుడిని హత మార్చడం ద్వారా తమ ఉనికి చాటు కోవడమే లక్ష్యంగా మావోయిస్టుల బెటాలియన్‌ రాష్ట్రంలో....

Police foiled a Maoist plan: ఉనికి కోసం వ్యూహం?

  • ఏపీలో దాడులకు నక్సల్స్‌ ప్రణాళిక!?

  • ఎవరో ఒకరిని చంపేయాలన్నదే ప్లాన్‌?

  • అందుకే రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తిష్ఠ

  • ముందుగానే పసిగట్టిన ఇంటెలిజెన్స్‌

  • మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అరెస్టు

  • అదుపులో హిడ్మా గన్‌మెన్‌, ‘దేవ్‌జీ’ గార్డులు

  • డెన్‌, వ్యూహాలపై కూపీ లాగుతున్న పోలీసులు

అమరావతి/విజయవాడ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రయం పొంది ఎవరో ఒక ప్రముఖుడిని హత మార్చడం ద్వారా తమ ఉనికి చాటు కోవడమే లక్ష్యంగా మావోయిస్టుల బెటాలియన్‌ రాష్ట్రంలో తిష్ఠ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ‘ఆపరేషన్‌ కగార్‌’ దెబ్బకు కకావికలమైన మావోయిస్టులు... ‘ఏదో ఒకటి’ చేసి తమ ఉనికి చాటుకోవడాకే ఏపీలోకి ప్రవేశించాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా మావోయిస్టుల కదలికలు పెద్దగాలేవు. పోలీసులు కూడా ఆ విషయంలో కొంత ఉదాసీనంగానే ఉన్నారు. ఈ క్రమంలో తమ పునరుజ్జీవానికి ఈ రాష్ట్రమే సానుకూలంగా ఉంటుందని మావోయిస్టులు భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఒక పూర్తి బెటాలియన్‌ను ఏపీలోకి పంపారు. ఏపీ ఎస్‌ఐబీ పోలీసులు అంతకన్నా అప్రమత్తంగా ఉండటంతో దాదాపు అందరూ దొరికిపోయారు. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు మడివి హిడ్మా, దేవ్‌జీ దళాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల వైపు వస్తున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. దీంతో సరిహద్దు జిల్లాల పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలకు ఎదురు పడ్డ హిడ్మా దళం ఎదురు కాల్పుల్లో అంతమైంది. ఇదే సమయంలో మరో కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతి దళం విజయవాడలో పట్టుబడింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఏలూరు, కాకినాడలోనూ ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చిన మావోయిస్టుల ఆచూకీని సైతం పోలీసులు కనుగొన్నారు. దీంతో మావోయిస్టుల ‘వ్యూహానికి’ అడ్డుకట్టపడింది. మరోవైపు, మావోయిస్టులను అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రముఖుల పర్యటనలపై ఆరా తీసిన డీజీపీ.. అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలకు భద్రత తగ్గకుండా చూసుకోవాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.


ముందు ఏది జరిగింది?

ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా డైరీలో కానూరులోని మావోయిస్టుల షెల్టర్‌ పేరు రాసి ఉందా?. షెల్టర్‌ను చుట్టుముట్టిన తర్వాత హిడ్మా ఉన్న అరణ్యం జాడ తెలిసిందా?. అన్నది సందిగ్ధంగా మారింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత అతని వద్ద లభించిన డైరీలో కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు తలదాచుకున్న షెల్టర్‌ భవనం పేరు, చిరునామా రాసి ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. ఆ సమాచారంతోనే గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బలగాలు ఈ భవనాన్ని చుట్టిముట్టినట్టు తెలుస్తోంది. దీంతోపాటు మరో వాదనా వినిపిస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచే మావోయిస్టులు ఉన్న షెల్టర్‌ భవనాన్ని బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు కొందరు చెబుతున్నారు. వారి ద్వారానే మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా ఉన్న ప్రదేశ సమాచారాన్ని రాబట్టినట్టు భావిస్తున్నారు. అక్కడ ఎన్‌కౌంటర్‌ పూర్తయిన తర్వాత హిడ్మాతోపాటు అతడి భార్య ఫొటోను అక్కడున్న బలగాలు ఇక్కడి బలగాలకు వాట్సా్‌పలో పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారిద్దరూ హిడ్మా దంపతులని షెల్టర్‌లో ఉన్న మావోయిస్టులు నిర్ధారించినట్టు ప్రచారం జరుగుతోంది.

అంతా ‘గెరిల్లా’ సభ్యులే

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బలగాలకు చిక్కిన వాళ్లంతా గెరిల్లా కమిటీ సభ్యులేనని తెలిసింది. మావోయిస్టుల్లో అగ్రనేతల భద్రతను ఈ గెరిల్లా కమిటీలే చూస్తాయి. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీకి రక్షణ దళంగా ఉన్న 9 మంది ఈ మావోయిస్టుల్లో ఉన్నారని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకోగా ఈ 9 మంది మినహా మిగిలిన వాళ్లంతా గెరిల్లా కమిటీ సభ్యులేనని తెలుస్తోంది.

Updated Date - Nov 19 , 2025 | 05:53 AM