Series of Encounters in Andhra Pradesh: ఏపీలో వరుస ఎన్‌కౌంటర్లు
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:31 AM
ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏవోబీ అడవుల్లో మావోయిస్టుల కదలికలు మరోసారి అలజడి రేపాయి. పార్టీ మిలిటరీ చీఫ్ హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడంతో మన్యం మరోసారి ఎరుపెక్కింది...
దండకారణ్యాన్ని జల్లెడపట్టిన గ్రేహౌండ్స్
నల్లమల నుంచి ఏవోబీకి పరిమితమైన నక్సల్స్
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) అడవుల్లో మావోయిస్టుల కదలికలు మరోసారి అలజడి రేపాయి. పార్టీ మిలిటరీ చీఫ్ హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడంతో మన్యం మరోసారి ఎరుపెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్ బరీలో పుట్టిన మావోయిజం మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నాయకత్వంలో బలపడింది. ఉమ్మడి ఏపీ నుంచి ఎక్కువ మంది మావోయిస్టు పార్టీ అగ్రనాయకులుగా ఎదగడంతో ఏపీ నుంచే గ్రేహౌండ్స్ పుట్టుకొచ్చింది. దశాబ్దాలుగా పోలీసులు దండకారణ్యాలను జల్లెడపడుతున్నా మావోయిస్టు పార్టీ ఉనికి పూర్తిగా కనుమరుగవలేదు. నల్లమల నుంచి తగ్గినా ఏవోబీలో మావోయిస్టుల ఉనికి ఉండేది. ఏపీలో బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఎక్కువ మంది పోలీసుల్ని కోల్పోగా... 2017లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా హిడ్మా ఎన్‌కౌంటర్... రాష్ట్రంలో కొన్నేళ్లుగా జరిగిన ఎన్‌కౌంటర్లను గుర్తుచేసింది.
అడ్డతీగల అడవుల్లో 2025 మే 7న ఎన్‌కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యర్రమ్మవరం-అడ్డతీగల అడవుల్లో ఈ ఏడాది మే 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కకూరి పాం డన్న అలియాస్ జగన్ (57)తో పాటు మరో సీనియర్ క్యాడర్ వంగా పొడియామి అలియాస్ రమేశ్ హతమయ్యాడు. వారిలో జగన్‌పై రూ.20 లక్షల రివార్డు ఉంది. ఆయన 30 ఏళ్లుగా మావోయిస్టుల్లో కీలకపాత్ర పోషించాడు.
మారేడుమిల్లిలో 2025 జూన్ 18న..
మారేడుమిల్లి అరణ్యంలో ఈ ఏడాది జూన్ 18న మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గజర్ల రవి అలియాస్ ఉదయ్ హతమైనట్టు పోలీసులు భావించారు. ఆయనతోపాటు రావి వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, మరో వ్యక్తి మృతి చెందారు. రవిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. దండకారణ్యంలో రవి కీలక మిలిటరీ వ్యూహకర్తగా పేరుపొందాడు.
కొయ్యూరులో 2001 జూన్ 16న ఆరుగురు హతం
తీగలమెట్ట అడవిలో జరగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో సండే గంగయ్య అలియాస్ అశోక్ (తెలంగాణ), రణదేవ్ అలియాస్ అర్జు న్(కలిమేల దళం), సంతు నాచికా (ఆరియా కమిటీ సభ్యుడు- ఒడిశా), మహిళా క్యాడర్లు పైకే (ఛత్తీ్‌సగఢ్), లలిత (జీకే వీధి) చనిపోయారు. సంఘటనా స్థల ంలో ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్, కార్బైన్ మూడు 303 రైఫిల్స్‌తో పాటు భారీ ఆయుధాలను గ్రేహౌండ్స్ స్వాధీనం చేసుకున్నాయి.
2021 జూలై 26న జీ.మాడుగులలో ఎన్‌కౌంటర్
2021 జూలై 26న జీ.మాడుగులలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఏఓబీ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. అదే ఏడాది ఆగస్టు 3న పెదబయలు మండలం చింతలవీధి వద్ద మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు.