Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:53 AM
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలున్నారు.
వారిలో 12 మంది మహిళలు
27 మందిపై రూ.65 లక్షల రివార్డు
24 నెలల్లో లొంగిపోయిన 2200 మంది నక్సల్స్
న్యూఢిల్లీ/ రాయిపూర్/ దంతేవాడ/ చర్ల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలున్నారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై రూ.65 లక్షల రివార్డు ఉంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయి మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో మిలీషియా, పార్టీ సభ్యులున్నారన్నారు. ఆదివారం లొంగిపోయిన వారిలో కుమాలి అలియాస్ అనిత మండవి, గీత అలియాస్ లక్ష్మి మడకం, రంజన్ అలియాస్ సోమ మాండవి, భీమ అలియాస్ జహజ్ కల్ములలో ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపట్టిన ‘పూన మార్గెం (పునరావాసం నుంచి సామాజిక పునః సమ్మేళనం)’ కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయారన్నారు. మావోయిస్టుల లొంగుబాటులో బస్తర్ ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా మారుతోందని గౌరవ్ రాయి తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకం కింత లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయంగా రూ.50 వేల నగదును అందిస్తారు. వ్యవసాయ భూమి కేటాయింపు, నైపుణ్య అభివృద్ధిలో శిక్షణనిస్తారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా గత 24 నెలల్లో అగ్ర నేతలు సహా 2200 మందికి పైగా మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారని వెల్లడించారు. గత 20 నెలల్లో దంతేవాడ జిల్లాలోనే 508 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోగా, వారిలో 165 మందిపై రివార్డు ఉందన్నారు.
అబూజ్‌మడ్‌లో ఐటీబీపీ వ్యూహాత్మక బేస్
మరోవైపు, వచ్చే మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయాలని లక్ష్యం దిశగా కేంద్రం వడివడిగా సమగ్ర ప్రణాళికతో సాగుతోంది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అభూజ్‌మడ్‌పై పట్టు సాధించిన ఐటీబీపీ జవాన్లు అదే ప్రాంతంలో నారాయణపూర్ జిల్లా కేంద్రానికి 140 కి.మీ దూరంలోని లంక గ్రామంలో 44వ బెటాలియన్ ఆపరేషనల్ బేస్‌ను నవంబరు 28న ఏర్పాటు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని నక్సల్స్‌కు కారిడార్‌గా మారిన అబూజ్‌మడ్ ప్రాంతంతో లంకెను విడగొట్టడమే దీని లక్ష్యం. ఛత్తీస్‌గఢ్-మహరాష్ట్ర సరిహద్దుకు 3 కి.మీ దూరంలో ఏర్పాటు చేసిన లంక బేస్ ద్వారా మహరాష్ట్రలోని గడ్చిరోలి, బీజాపూర్ జిల్లాలోని బెడ్రె ప్రాంతంలోని నక్సల్స్ కదలికలను, వారికి సరుకుల సరఫరాను నిరోధించనున్నారు. 3 నెలల్లో ఐటీబీపీ ఏర్పాటు చేసిన 9వ బెటాలియన్ ఇది. లంకతోపాటు ఎడ్జుమ్, ఇద్వాయ, అడెర్, కుడ్మెల్, జట్లూర్, ధోబె, దొది మక్కా, పడ్మెట ప్రాంతాల్లోనూ ఐటీబీపీ క్యాంపులున్నాయి.
పోలీసు వలయంలో..మావోయిస్టు నేత
చెల్లూరు నారాయణరావు..?
వజ్రపుకొత్తూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మరో మావోయిస్టు నేత పోలీసు వలయంలో చిక్కుకున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేశ్ పోలీసుల వలయంలో ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ ఏవోబీ కార్యదర్శిగా చెల్లూరు నారాయణరావు వ్యవహరిస్తున్నారు. ఈయనపై రూ.20 లక్షల రివార్డు ఉంది. నారాయణరావు 1989లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్‌శంకర్ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిందే. అప్పటి నుంచి నారాయణరావు ఆచూకీ కోసం ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంరఽధా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాల చక్రబంధంలో నారాయణరావు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పోలీసులు బాతుపురం వచ్చి గ్రామపెద్దలు, నారాయణరావు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. నారాయణరావు లొంగుబాటుకు సహకరించాలని కోరినట్టు తెలిసింది.