Maoist Movement: నడిచే వారేరీ? నడిపించేదెవరు?
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:12 AM
పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో 1967 మే 25న రైతాంగం తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించింది. ఆ పోరాటమే నక్సల్బరీ ఉద్యమంగా చర్రితకెక్కింది...
దశ, దిశ నేర్పిన నేతల లొంగుబాటు
45 ఏళ్ల తర్వాత మళ్లీ మొదటికి ఉద్యమం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో 1967 మే 25న రైతాంగం తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించింది. ఆ పోరాటమే నక్సల్బరీ ఉద్యమంగా చర్రితకెక్కింది. ఈ ఉద్యమానికి నాయక త్వం వహించిన రైతాంగ నేత చారుమజుందార్. అప్పటి సీపీఎంతో తెగదెంపులు చేసుకుని సీపీఐ(ఎం.ఎల్.)ను ఏర్పాటు చేశారు. చారుమజుందార్ మరణంతో ఇక పార్టీ ఉండదని అంతా అనుకున్నారు. కానీ... 1980లో పీపుల్స్‌వార్ రూపంలో మరో బలమైన ఉద్యమం ముందుకొచ్చింది. మొత్తం 16 రాష్ట్రాలు, 120కిపైగా జిల్లాల్లో నక్సల్స్ పాగావేశారు. దేశ అంతర్గత భద్రతకు తొలి శత్రువు నక్సల్సే అని కేంద్రం ప్రకటించేంతగా వారు ఎదిగారు. ప్రత్యేకసైన్యం ఏర్పాటు చేసుకుని, సొంత రాజ్యమే నడిపించారు. అలాంటిది...ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఆ ఉద్యమమే ప్రశ్నార్థకంగా మారింది.
ప్రజాసైన్యంతో దాడుల... దడ
1995 నాటికే పీపుల్స్‌వార్ దండకారణ్య ప్రాంతాన్ని గెరిల్లా జోన్‌గా ప్రకటించింది. ఆ జోన్‌లో సొంత రాజ్యాన్ని జనతన సర్కారు పేరిట ఏర్పాటుచేసింది. అయితే, 1999లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి, శీలంనరేశ్‌లను ఉమ్మడి ఏపీలోని కొయ్యూరులో 1999 డిసెంబరు 2వ తేదీన పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ ముగ్గురు నాయకుల స్మారకంగా, వారి తొలి వర్ధంతి నాడు, అంటే 2000 డిసెంబరు 2న పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీఎజీఏ)ను పీపుల్స్‌వార్ ఏర్పాటుచేసింది. మరో సాయుధ సంస్థఎంసీసీతో 2003 నుంచే విలీన చర్చలు ప్రారంభించింది. 2004కు అవి కొలిక్కి వచ్చాయి. డీకేలో పీపుల్స్‌వార్ అగ్రనాయకుల హెడ్‌క్వార్టర్స్ అయిన అబూజ్‌మడ్‌లో జరిగిన సమావేశంలో ఆ రెండు పార్టీలు విలీనమై... భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. గణపతి కొత్త పార్టీకీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి కేంద్ర కమిటీలో 38 మంది, పొలిట్‌బ్యూరోలో 14 మంది సభ్యులు ఉండేవారు. ఈ విలీనం తర్వాత పీజీఏను పీఎల్‌జీఏగా మార్చారు. పెరిగిన సైన్యంతో మావోయిస్టు పార్టీ దండకారణ్యంపై పూర్తిపట్టును సాధించుకుంది. జనతన సర్కార్‌ల పరిధిని పెంచుకుంది.
విస్తరణతోపాటే భారీ నష్టం
ఇటు పీపుల్స్‌వార్‌గా ఉన్నప్పుడు, ఆతర్వాత మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించడంతోపాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. తీవ్రనిర్భంద కాలంలో ఏపీ, తెలంగాణతోపాటు, దండకారణ్యం పరిధిలో భారీగా కార్యకర్తలను, నాయకులను ఎన్‌కౌంటర్లలో కోల్పోయింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిదెబ్బ కర్ణాటకలో పడింది. ఆ రాష్ట్ర కార్యదర్శి, చరిత్రకారుడు సాకేత్ రాజన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. తొలి ఏడాదే 275 మంది ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. 2005లో ఏకంగా 650 మంది, 2006లో 456 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. అయితే, మావోయిస్టులు కూడా అంతే తీవ్రంగా ప్రతిదాడులకు పాల్పడ్డారు. దడ పుట్టించారు. మరోవైపు మరణాలూ పెరిగాయి. 2006లో మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జి వడ్కాపుర్ చంద్రమౌళి, 2007లో కేంద్ర కమిటీ సభ్యుడు సందే రాజమౌళి, 2009లో మిలిటరీ వ్యూహకర్త పటేల్ సుధాకర్‌రెడ్డి, 2010లో పొలిట్‌బ్యూరో సభ్యు డు ఆజాద్ ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
గ్రీన్‌హంట్‌తో సెట్‌బ్యాక్
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. వరస ఎన్ కౌంటర్లు మావోయిస్టు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. శాఖమూరి అప్పారావు, ఇతర నేతల ఎన్‌కౌంటర్లతో ఆందోళనకు గురయిన ఆ పార్టీ శాంతిచర్చలను తెరమీదకు తీసుకొచ్చింది. అయితే, శాంతి చర్చల అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తోన్న ఆ పార్టీ అధికారప్రతినిధి ఆజాద్ కూడా ఎన్‌కౌంటర్ అయ్యారు.2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గ్రీన్‌హంట్ మూడో దశ కూడా సాగింది. ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్‌లు ముందుకొచ్చాయి. 2024 జనవరి నుంచి కగార్ ఆపరేషన్ మొదలైంది. భద్రతా బలగాలకు మానవ రహిత విమానాలు, అత్యాధునిక డ్రోన్‌లను కేంద్ర ప్రభుత్వం అందించింది. వాటి పనితీరు ఎంతగా ఉందంటే, అడవుల్లో ఏ ఇద్దరు కలిసి తిరిగినా వెంటనే గుర్తించి 56-70 కిలోమీటర్ల దూరంలోని కమాండ్ కంట్రోల్‌కు సిగ్నల్ ఇచ్చేంతగా ఫలితాలు ఇచ్చాయి. ఫలితంగా భద్రతా బలగాలు మావోయిస్టులను వెతుక్కుంటూ వెళ్లడం సులువైంది. దీంతో మావోయిస్టులకు ఊహించని నష్టం వాటిల్లింది. విముక్తి ప్రాంతాలు సహా 28 వ్యూహాత్మక ఏరియాలను కోల్పోయారు.
వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు దండకారణ్యంలో ఉండలేని పరిస్థితిని భద్రతా బలగాలు తీసుకొచ్చాయి. ఫలితంగా మావోయిస్టులు శాంతిచర్చలు జరపాలని కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచారు. ఇందుకు కే ంద్రం అంగీకరించలేదు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో ఇక శాంతిచర్చలకు అవకాశం ఉండదని స్పష్టమైంది. ఆ తర్వాత అన తికాలంలోనే ఆపార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు( బస్వరాజ్ ) సహా మరో 18 మంది కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. లొంగిపోతే ప్రాణమయినా దక్కుతుందని కొందరు, ఇప్పుడు సాయుధ పోరాటం చేయలేమని మరి కొందరు నేతలు నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (సోను), కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న సహా అనేక మంది ప్రభుత్వం ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్‌చార్జి, బెటాలియన్ 1 కమాండర్ హిడ్మా, ఆయన బృందం ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఆయన ప్లటూన్‌లోని అనేక మంది మిలిటెంట్లు విజయవాడలో పోలీసులకు చిక్కారు. దండకారణ్యంపై పట్టుకున్న హిడ్మానే అక్కడి నుంచి బయటకు వచ్చారంటే అడవిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.