Share News

Maoist Mad Division Committee: ఆయుధాలు వీడుతాం

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:40 AM

ఆయుధాలు వీడుతామని పేర్కొంటూ ఛత్తీస్గ‌‌‌‌‌ఢ్‌లోని మాడ్‌ డివిజను కమిటీ కార్యదర్శి రాణిత అలియాస్‌ సనిత పేరిట ఓ లేఖ విడుదలైంది. ఈనెల 15 వరకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు.

Maoist Mad Division Committee: ఆయుధాలు వీడుతాం

  • పదిహేను వరకు సమయం ఇవ్వండి

  • మావోయిస్టు పార్టీ మాడ్‌ డివిజన్‌ కమిటీ పేరిట లేఖ

చింతూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఆయుధాలు వీడుతామని పేర్కొంటూ ఛత్తీస్గ‌‌‌‌‌ఢ్‌లోని మాడ్‌ డివిజను కమిటీ కార్యదర్శి రాణిత అలియాస్‌ సనిత పేరిట ఓ లేఖ విడుదలైంది. ఈనెల 15 వరకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు. వాస్తవానికి ఈనెల 4నే రాసినట్టు లేఖపై తేదీ కనిపిస్తోంది. అయితే అది మంగళవారం బయటకి వచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ అలియాస్‌ సోనూ విజ్ఞప్తులకు మాడ్‌ డివిజను కమిటీతో సహా పలు కమిటీలు మద్దతు ఇస్తున్నాయని రాణిత పేర్కొన్నారు. వాస్తవానికి ఏప్రిల్‌, మే నెలల్లోనే సాయుధ పోరాటాలకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తాజాగా కార్యకర్తలకు, ప్రజలకు సోనూ చేసిన విజ్ఞప్తిని, లేఖను చదవామని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను గుర్తించడంలో, తదనుగుణంగా విప్లవ ఉద్యమంలో మార్పులు చేయడంలో కేంద్ర కమిటీ విఫలమైందన్నారు. తప్పుడు నిర్ణయాల కారణంగా తమ ప్రయత్నాలేవీ సఫలం కాలేదన్నారు. ఈ క్రమంలో ఆయుధాలు వీడేందుకు నిర్ణయం తీసుకున్నామని, స్నేహపూర్వక సంస్థలతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని తమ పార్టీకి, కార్యకర్తలకు వివరించాల్సి ఉన్నదన్నారు. కానీ కొనసాగుతున్న అణిచివేత మధ్య ఆ పనిని పూర్తి చేయలేమని పేర్కొన్నారు. దీని కోసం కొంతకాలం పోలీసు గస్తీ నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. ఈనెల 15వ తేదీలోపు ఆ పని పూర్తి చేస్తామన్నారు. మాడ్‌ పరిధిలో ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడబోమని, బాధ్యతాయుతంగా ఉంటామని లేఖలో రాణిత ప్రకటించారు.

Updated Date - Oct 08 , 2025 | 06:41 AM