SP Amit Bardar: ఎమ్మెల్యే కిడారి, సోమల హంతకులు వీళ్లే
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:53 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ కమిటీ సీనియర్ నాయకురాలు వెంకటరవి చైతన్య అలియాస్ అరుణ, కమిటీ మెంబరు అంజూ అలియాస్ మాసే మృతి చెందినట్టు ఎస్పీ అమిత్ బర్దార్ ధ్రువీకరించారు.
గాజర్ల రవి, అరుణపై 150 కేసులు, 20 లక్షల రివార్డు
పాపికొండలు అడవుల్లో మూడు నెలలుగా మకాం
మృతిని ధ్రువీకరించిన అల్లూరి జిల్లా ఎస్పీ బర్దార్
విశాలాక్షి నగర్ (విశాఖపట్నం), రంపచోడవరం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ కమిటీ సీనియర్ నాయకురాలు వెంకటరవి చైతన్య అలియాస్ అరుణ, కమిటీ మెంబరు అంజూ అలియాస్ మాసే మృతి చెందినట్టు ఎస్పీ అమిత్ బర్దార్ ధ్రువీకరించారు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమల హత్య ఘటనలో వీరు పాల్గొన్నారని తెలిపారు. కైలాసగిరి ఆర్మ్‌డ్ రిజర్వు కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం మారేడుమిల్లి అడవుల్లో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లోనే వీరు మరణించారన్నారు. అల్లూరి జిల్లాలో గాజర్ల రవిపై సుమారు 150కి పైగా కేసులు, ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు. అరుణపై సుమారు 150కి పైగా కేసులు, ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు చెప్పారు. అంజూపై 22 కేసులు, లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు వివరించారు.
శేషరాయి కాల్పుల్లో తప్పించుకుని..
అల్లూరి జిల్లా శేషరాయి అడవుల్లోను, మంప అడవుల్లోను జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి ఇటీవల రవి, అరుణ త్రుటిలో తప్పించుకున్నారని ఎస్పీ తెలిపారు. మూడు నెలలుగా అల్లూరి జిల్లాలో తిరుగుతున్నారని పేర్కొన్నారు. పాపికొండలు అభయారణ్యంలో రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి సరిహద్దుల్లో వీరి కదలికలు ఎక్కువగా ఉండేవన్నారు. ఈ ప్రాంతంలోనే బుధవారం ఎన్‌కౌంటర్ జరిగిందని, లొంగిపోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చి లొంగిపోయే వారికి హానీ తలపెట్టమని, అన్ని సహకారాలు అందిస్తామని ఎస్పీ తెలిపారు.