Alluri Sitharama Raju District: లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:31 AM
మావోయిస్టు పార్టీకి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (ఎస్‌జడ్‌సీఎం) దిరిదో విజ్జల్ అలియాస్ జైలాల్, అతని భార్య డివిజనల్ కమిటీ మెంబర్(డీసీఎం)...
ఒకరు ఎస్‌జడ్‌సీఎం, మరొకరు డీసీఎం
పాడేరు రూరల్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (ఎస్‌జడ్‌సీఎం) దిరిదో విజ్జల్ అలియాస్ జైలాల్, అతని భార్య డివిజనల్ కమిటీ మెంబర్(డీసీఎం) మడివి గంగి అలియాస్ విమల అలియాస్ భీమేలు ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయారు. మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గగనపల్లి పంచాయతీ బోడెగుబ్బల్ గ్రామానికి చెందిన విజ్జల్ 4 దశాబ్దాల క్రితం ఉద్యమబాట పట్టి వివిధ హోదాల్లో పనిచేశాడని వివరించారు. 1994లో పశ్చిమ బస్తర్ ప్రాంత దళ సభ్యుడిగా, జాతీయ పార్క్ ప్రాంతం ఏసీఎం, పీపీసీఎం, ఎల్‌వోఎస్ కమాండర్‌గా, కుంటా ప్రాంత సెక్షన్ కమాండర్‌గా, తెలంగాణ డీవీసీఎం, సీవైపీసీగా, ఏవోబీ, దక్షిణ, పశ్చిమ బస్తర్, మాడ్, గడ్చిరోలి ప్రాంతాల్లో ఆపరేషన్ చేశాడని తెలిపారు. ఏడు మెరుపుదాడులు, ఏడు క్యాంప్ దాడులు, రెండు ఎదురు కాల్పులు, ఒక బ్యాంకు దోపిడీ, ఒక ఐఈడీ పేల్చిన ఘటనలో పాల్గొన్నాడని వివరించారు. ఇతని భార్య గంగి 20 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి, ఏడు ఎదురుకాల్పులతో పాటు అనేక హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.