Manyam Villagers: మన్యం జిల్లాలో తప్పని డోలీ మోత
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:48 AM
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కొన్ని గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు.
కొమరాడ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కొన్ని గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆ ప్రాంతవాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. పూడేసు పంచాయతీ పరిధి గుమడింగి కొండ శిఖర గ్రామానికి చెందిన ఆరిక దండు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం పరిస్థితి విషమించడంతో భార్య జమ్మాలమ్మ, కొడుకు మోహన్‌రావు, గ్రామస్థులు హరి, నాగార్జునతో కలిసి దండుకు డోలీ కట్టారు. సుమారు మూడు కిలోమీటర్లు డోలీ మోసుకుంటూ... రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి ఒడిశా రాష్ట్రం కొమ్ముగండ గ్రామం వరకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటో ద్వారా పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు దండును పరీక్షించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని, డోలీ మోతలు తప్పించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు.