Field Visit: కొండలెక్కిన మన్యం కలెక్టర్
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:46 AM
గిరిజనులతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కొండలెక్కి సుమారు మూడు కిలోమీటర్లు నడిచివెళ్లారు.
మూడు కిలోమీటర్లు నడిచి గిరిజనుల చెంతకు
సమస్యలు అడిగి తెలుసుకొని.. పరిష్కారానికి హామీ
లొద్ద జలపాతం అభివృద్ధికి అధికారులతో సమీక్ష
పార్వతీపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): గిరిజనులతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కొండలెక్కి సుమారు మూడు కిలోమీటర్లు నడిచివెళ్లారు. సాలూరు మండలంలోని లొద్ద జలపాతం వద్ద నివసిస్తున్న గిరిజనుల వద్దకు కలెక్టర్ ఆదివారం పయనమయ్యారు. పార్వతీపురం నుంచి కారులో మక్కువ మండలం నంద వరకు వెళ్లారు. అక్కడి నుంచి అధికారులతో కలిసి జీపుల్లో లొద్దకు బయలుదేరారు. వర్షాలకు మట్టి రోడ్డు పాడవడంతో మాసినవలస దాటిన తర్వాత జీపులను నిలిపివేశారు. అక్కడి నుంచి కొద్ది దూరం బైక్‌లపై పయనించారు. అనంతరం మూ డు కిలోమీటర్లు నడిచి లొద్ద వద్దకు చేరుకున్నారు. అక్క డి గిరిజనులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల మంజూరుకు హామీ ఇచ్చారు. గిరిజనులు అందించిన రాగి సంకటి తిని, అంబలి తాగారు. అనంతరం మరో రెండు కిలోమీటర్లు వరకు నడిచి లొద్ద జలపాతానికి కలెక్టర్ చేరుకున్నారు. జలపాతంలో ఆయన స్నానం చేశారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించారు. లొద్ద జలపాతం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సాయంత్రం వర్షం తగ్గిన తర్వాత జీపుల వద్దకు చేరుకొని తిరుగుపయనమయ్యారు.