Share News

Montha Cyclone: ఉప్పాడ తీరం అల్లకల్లోలం

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:07 AM

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల తీవ్రత పెరిగింది.

Montha Cyclone: ఉప్పాడ తీరం అల్లకల్లోలం

  • కాకినాడ పోర్టులో ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక

కాకినాడ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. కాకినాడలో హైఅలర్ట్‌ ప్రకటించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉండడంతో కాకినాడ పోర్టులో ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2014లో హుద్‌హుద్‌ తుఫాను తర్వాత ఇక్కడ ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. పోర్టులో కార్గో ఎగుమతి, దిగుమతులు నిలిపివేశారు. 16 నౌకలను బెర్త్‌ల నుంచి సముద్రంలోకి తరలించారు. ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌ రోడ్డును భారీగా అలలు తాకాయి. కోత నివారణకు అడ్డంగా నిర్మించిన బండరాళ్లు సైతం కదిలించాయి. తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాలో 12 మండలాల్లో అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 12 మండలాల పరిధిలో 67 గ్రామాల్లో నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా. 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరప్రాంత మండలాల్లో ఉంటున్న 9,500 మందిని పునరావాస శిబిరాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను తీరం దాటే సమయంలోను, ఆ తర్వాత పెనుగాలుల తీవ్రతకు 2 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉన్నట్లు ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కోసం 3 వేల స్తంభాలను తెప్పించారు. రాయలసీమ నుంచి విద్యుత్‌ లైన్‌మెన్లు, సిబ్బంది కలిపి వెయ్యిమందిని జిల్లాకు తరలించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత పెరగడంతో అనేకచోట్ల పంటలు నేలకొరిగాయి. ఇప్పటివరకు జిల్లాలో 2,295 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. కాకినాడ రూరల్‌లోని సూర్యారావుపేట పరిధిలోని పర్రకాలువ వంతెన దాటుతూ ఆరో తరగతి విద్యార్థి సాయిచరణ్‌ గల్లంతయ్యాడు. మొత్తం 3.35 లక్షల మందిని తుఫాన్‌ ప్రభావిత ప్రజలుగా గుర్తించారు.


200 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. 142 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించారు. కొత్తపల్లి మండలం ఉప్పాడలోని సుబ్బంపేట వద్ద తీరాన్ని జనసేన నేతలతో కలిసి కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌ పరిశీలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ఆయన వెంట ఉన్నాయి. కాకినాడ రూరల్‌ మండలం హార్బరుపేటలో మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ అప్రమత్తం చేశారు. జోరువానలోను ఆయన మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా మత్స్యకార గ్రామాల్లో తిరిగి అందరినీ అప్రమత్తం చేశారు.


  • తుఫానుపై సన్నద్ధం

  • మంత్రులు నారాయణ, నాదెండ్ల, కొండపల్లి సమీక్షలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘మొంథా’ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తామంతా సన్నద్ధంగా ఉన్నామని కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ చెప్పారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో తుఫాన్‌ ప్రత్యేకాధికారి కృష్ణతేజ, కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ఎంపీలు ఉదయ్‌ శ్రీనివాస్‌, సానా సతీష్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్పలతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,194 పునరావా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 470 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యలంక, రామాపురం, వాడరేవు బీచ్‌ల మూసివేత కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 1,547 మంది గర్బిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. అత్యవసర సేవల కోసం మండలానికో బస్సు సిద్ధంగా ఉంచారు. ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌, ప్రభుత్వ సీఎస్‌, తుఫాన్‌ పర్యవేక్షణ జోనల్‌ ప్రత్యేకాధికారి ఆర్‌.పి.సిసోడియా, జిల్లా ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 82 తుఫాన్‌ సహాయక కేంద్రాలు, 11 లంక గ్రామాల్లో ఆహారం, వైద్యం, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొగల్తూరులో పర్యాటక రిసార్ట్‌లు, బీచ్‌ను మూసివేశారు. ఉభయగోదావరి జిల్లాల ఇన్‌చార్జి సిసోడియా తుఫాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్‌ నాగరాణితో సమీక్ష నిర్వహించారు. కృష్ణాజిల్లాలో కలెక్టర్‌ బాలాజీ, జేసీ నవీన్‌, ఎస్పీ విద్యాసాగర్‌ పలు మండలాల్లో పర్యటించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి మచిలీపట్నంలోని గిలకలదిండిలో పర్యటించారు.


విజయనగరం జిల్లా దత్తిరాజేరు తహసీల్దార్‌ కార్యాలయంలోని కంట్రోలు రూమ్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పరిశీలించారు .కోనసీమ జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులైన విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు, కలెక్టర్‌ మహే్‌షకుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను సన్నద్ధత ఏర్పాట్లను సమీక్షించారు. అనకాపల్లి జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు 24 మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేశారు. ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. 34 తుఫాన్‌ ప్రభావిత గ్రామాలను గుర్తించి, 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌ నుంచి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ జిల్లా అధికారులకు సూచనలు చేస్తున్నారు. జిల్లాలోని పర్యాటక కేంద్రాలన్నీ మూసేశారు. బోటు షికారు, టూర్‌ ప్యాకేజీ బస్సులు కూడా నిలిపివేశారు.

Updated Date - Oct 28 , 2025 | 06:07 AM