మామిడి ఎగుమతులు ముమ్మరం
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:49 AM
నున్న మ్యాంగో మార్కెట్‌లో మామిడి ఎగుమతులు ఊపందుకున్నాయి. మార్కెట్‌లో 80 శాతం దుకాణాలు వ్యాపార లావాదేవీలు కొన సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 300 టన్నుల వరకు మామిడిని పలు రాషా్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే మార్కెట్‌లో ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీలు తక్కువే. పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్ మండీలు(లోకల్ మండీలు) ఏర్పాటు చేయడంతో ఆ ప్రభావం నున్న మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.

నున్న మ్యాంగో మార్కెట్ నుంచి రోజుకు 300 టన్నులపైనే ఎగుమతి
మహారాష్ట్ర, గుజరాత, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్‌కు తరలింపు
గతంతో పోలిస్తే తగ్గిన వ్యాపారం
మార్కెట్‌పై బంద్ మండీల ప్రభావం
ఈ ఏడాది కాపు తక్కువే..
మార్కెట్‌ను నూజివీడుకు తరలిస్తేనే పూర్వవైభవం!
విజయవాడ రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : నున్న మ్యాంగో మార్కెట్‌లో మామిడి ఎగుమతులు ఊపందుకున్నాయి. మార్కెట్‌లో 80 శాతం దుకాణాలు వ్యాపార లావాదేవీలు కొన సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 300 టన్నుల వరకు మామిడిని పలు రాషా్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే మార్కెట్‌లో ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీలు తక్కువే. పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్ మండీలు(లోకల్ మండీలు) ఏర్పాటు చేయడంతో ఆ ప్రభావం నున్న మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది వివిధ కారణాలతో కాపు కూడా తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో నున్న మ్యాంగో మార్కెట్‌ను నూజివీడుకు తరలించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
రోజుకు 300 టన్నుల ఎగుమతులు
నున్న మ్యాంగో మార్కెట్‌లో 40 వరకు దుకాణాలు ఉండగా 30కిపైగా దుకాణాలు తెరుచుకున్నాయి. ఒక్కో దుకాణం 10 నుంచి 15 టన్నులు వరకు మామిడి ఎగుమతులు చేస్తోంది. మొత్తం మీద 300 టన్నులకు పైగా ఇతర రాషా్ట్రలకు ఎగుమతులు అవుతున్నాయి. బంగినపల్లి టన్ను మొదటి క్వాలిటీ రూ.50 వేల నుంచి రూ. 55 వేల వరకు అమ్ముడవుతుండగా, రెండవ రకం రూ.30 వేల నుంచి రూ. 35 వేల వరకు ధర పలుకుతుంది.
ఆరు రాషా్ట్రలకు ఎగుమతులు
ప్రస్తుతం మార్కెట్‌లో సమీప జిల్లాల నుంచి చెరుకురసం, బంగినపల్లి, తోతాపురి అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాషా్ట్రలకు వ్యాపారులు మామిడిని ఎగుమతులు చేస్తున్నారు.
బంద్ మండీల ప్రభావం
నున్న మ్యాంగో మార్కెట్‌కు విస్సన్నపేట, నూజివీడు, సత్తుపల్లి, రెడ్డిగూడెం, చీమలపాడు, తదితర ప్రాంతాల నుంచి మామిడి దిగుమతులు అవుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు బంద్ మండీలు ఏర్పాటు చేయడంతో చాలా వరకు రైతులు రవాణా ఖర్చులు మిగులుతాయనే ఉద్దేశ్యంతో ఎక్కడికక్కడ అమ్మకాలు జరుపుతుండటంతో నున్న మ్యాంగో మార్కెట్‌లో దిగుమతి తగ్గింది.
ఈ ఏడాది కాపు తక్కువే..
గతంతో పోలిస్తే ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటం కూడా మార్కెట్‌లో ప్రభావం చూపుతోంది. మామిడి కాపు మొదట్లో పూత గతంతో కన్నా ఎక్కువ వచ్చినా కోడిపేను తెగులు కారణంగా పూత 95 శాతం రాలిపోయినట్లు రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన గాలివాన బీభత్సం కూడా పూత, కాయలు రాలి మరింత నష్టాన్ని మిగిల్చాయి.
నూజివీడు తరలింపునకు ప్రయత్నాలు
మామిడి దిగుమతులు అయ్యే తోటలకు నున్న మ్యాంగో మార్కెట్ దూరంగా ఉండటంతో మార్కెట్‌ను నూజివీడుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి కన్నా నూజివీడులో దుకాణాలు తెరిస్తే అధిక సంఖ్యలో రైతులు మార్కెట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తద్వారా వ్యాపారాలు పెరుగుతాయని రైతులకు కూడా ఉపయోగంగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
మంత్రి లోకేశ్ దృష్టికి మార్కెట్ తరలింపు విషయం
నున్న మ్యాంగో మార్కెట్‌లో వ్యాపారాలు దాదాపు తగ్గుమొఖం పట్టాయి. రైతులు ఇక్కడికి రావడం దూరాభారంగా భావిస్తున్నారు. ఈ విషయమై గతంలో మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి రైతులతో సమావేశమయ్యారు. రైతులు కూడా మార్కెట్ కావాలని కోరడంతో అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- శ్రీనివాసరెడ్డి, మ్యాంగో గ్రోయర్స్ అసోషియేషన్ కార్యదర్శి