Share News

Temple Renovation: మంగళాద్రికి మహర్దశ..

ABN , Publish Date - Aug 26 , 2025 | 05:32 AM

మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి దివ్య క్షేత్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమైంది. దాదాపు ఎనిమిది నెలలుగా వివిధ కోణాల్లో చర్చించి, పరిశోధించి దీన్ని రూపొందించారు.

Temple Renovation: మంగళాద్రికి మహర్దశ..

  • 155 కోట్లతో లక్ష్మీనృసింహస్వామి దివ్యక్షేత్రం అభివృద్ధి

  • కేంద్ర పథకం ‘సాస్కీ’ కింద నిధులు రాబట్టేలా కృషి

  • చాలెంజ్‌గా తీసుకున్న మంత్రి లోకేశ్‌

  • ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రెడీ

మంగళగిరి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి దివ్య క్షేత్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమైంది. దాదాపు ఎనిమిది నెలలుగా వివిధ కోణాల్లో చర్చించి, పరిశోధించి దీన్ని రూపొందించారు. మంగళాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధిని చాలెంజ్‌గా స్వీకరించిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్‌.. దేవదాయ, పర్యాటక, అటవీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, రెవెన్యూ శాఖలతో 20 సార్లకుపైగా సమావేశమయ్యారు. ఎట్టకేలకు హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎంజీ డిజైన్‌ ఇంక్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. దీనిప్రకారం మొత్తం క్షేత్రాభివృద్ధికి రూ.147.53 కోట్లు అవసరమని అంచనా వేశారు. మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. దీంతోపాటే దిగువ సన్నిధి ఆసాంతాన్ని జీర్ణోద్ధరణ చేసేందుకు మరో రూ.7 కోట్ల దేవదాయశాఖ నిఽధులను సమాంతరంగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే మొత్తం క్షేత్రాభివృద్ధికి రూ.155 కోట్లు ఖర్చు చేయనున్నారు.


మాస్టర్‌ ప్లాన్‌లో అభివృద్ధి పనులు..

మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మంగళగిరి కొండ చుట్టూ 3/4 వంతు భాగంలో పాత, కొత్త హైవేలను కలిపేలా వంద అడుగుల రోడ్డును 3.47 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మిస్తారు. ఈ పనులకు మొత్తం రూ.40.42 కోట్లు అవుతాయని అంచనా వేశారు. దిగువ సన్నిధికి తూర్పు వైపు ప్రాంతం అభివృద్ధికి రూ.60 కోట్లు, దిగువ సన్నిధిలో ప్రధానాలయ విమాన గోపురం, అమ్మవారి విమాన శిఖరం, శ్రీకృష్ణదేవరాయ ముఖ మండపం, వాహన శాల, యాగశాలను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ఆలయ నిధులు రూ.7 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఎగువ సన్నిధిలో అభివృద్ధి పనులను రూ.11.20 కోట్లు, కొండ శిఖర భాగంలో ఉన్న శ్రీ గండాలయస్వామి సన్నిధి అభివృద్ధికి రూ.1.80 కోట్లు, పెదకోనేరు ఆధునీకరణకు రూ.3.80 కోట్లు, దిగువ సన్నిధిలో గోపురాలు, ప్రహరీ మరమ్మతులు, తాగునీటి వసతి, ఎలక్ట్రికల్‌ పనుల నిమిత్తం రూ.3.75 కోట్లు వెచ్చిస్తారు. మంగళగిరి ఎయిమ్స్‌ వెంబడి ఇప్పటికే ఉన్న ఎకో పార్కును రూ.12.03 కోట్లతో మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కీ కింద రాబట్టేందుకు మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారు. ఈ పథకం కింద సుమారు రూ.100 కోట్ల వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయి. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

Updated Date - Aug 26 , 2025 | 05:33 AM