Excise Department: ప్రతి సీసా స్కాన్ చేయాల్సిందే
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:10 AM
నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. షాపుల్లో నకిలీ మద్యం అమ్మకాలకు తావులేకుండా రోజువారీ స్వచ్ఛత పరిశీలన విధానంను ప్రవేశపెట్టింది.
ఆ తర్వాతే వినియోగదారుకు విక్రయించాలి
స్కాన్ కాని మద్యం సీసాలు అమ్మకూడదు
అమ్మకాల్లో ‘రోజువారీ స్వచ్ఛత పరిశీలన విధానం’
అమ్మే ముందు స్కాన్ ద్వారా స్వచ్ఛత నిర్ధారణ
నకిలీ మద్యం అమ్మితే లైసెన్సీలదే బాధ్యత
ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. షాపుల్లో నకిలీ మద్యం అమ్మకాలకు తావులేకుండా ‘రోజువారీ స్వచ్ఛత పరిశీలన విధానం’ను ప్రవేశపెట్టింది. ఇకపై మద్యం షాపులు, బార్లు, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో ప్రతి సీసాను స్కాన్ చేసిన తర్వాతే వినియోగదారులకు విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త విధానంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం... ప్రతి మద్యం షాపు, బార్, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో ‘ఇక్కడ విక్రయించే మద్యాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేసి దాని స్వచ్ఛత, నాణ్యతను నిర్ధారించాం’ అని బోర్డులు పెట్టాలి. ప్రతి సీసాను కచ్చితంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ఆ తర్వాతే విక్రయించాలి. సీసాపై సీల్, మూత, హోలోగ్రామ్‌ను పరిశీలించాలి. స్వచ్ఛత పరిశీలనకు ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించాలి. స్కాన్ చేసిన తర్వాత సీసా పరిశీలించబడిందని, విక్రయించవచ్చు అని వస్తేనే అమ్మాలి. ఒకవేళ సీసాపై ఉన్న కోడ్ సరిపోలకపోయినా(మి్‌సమ్యాచ్ అయినా), తిరిగి ఉపయోగించారు అని వచ్చినా సీసాను అమ్మకుండా ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అసలు కోడ్ లేకుండా ఉంటే అది ప్రభుత్వం అమ్మిన మద్యం కాదని భావించి వెంటనే ఆ సీసాను ఎక్సైజ్‌శాఖకు అప్పగించాలి. ప్రతిరోజూ ఎక్సైజ్ అధికారులు షాపులు, బార్లు, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో మద్యం సీసాలను పరిశీలించి స్కాన్ ద్వారా స్వచ్ఛతను నిర్ధారించాలి.
స్కానింగ్ రిజస్టర్లపై ప్రతిరోజూ ఎక్సైజ్ అధికారులు సంతకాలు చేయాలి. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దిగుమతి చేసుకునే సమయంలో కనీసం 5శాతం సీసాలను స్కాన్ చేసి ఒరిజినల్ అని నిర్ధారించుకోవాలి. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లపై లైసెన్సీకి సంబంధించిన వ్యక్తి సంతకం చేయాలి. అనంతరం అధికారుల తనిఖీల్లో నకిలీ, తిరిగి నింపినట్లు, నీళ్లు కలిపినట్లు గుర్తిస్తే అది లైసెన్సీల నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ఒకవేళ నకిలీ మద్యం లేదా ఎన్‌డీపీఎల్ దొరికితే వెంటనే షాపు లేదా బార్‌ను సీజ్ చేస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం లైసెన్స్ రద్దు చేస్తారు.