National Investigation Agency: ధర్మవరం వాసికి ఉగ్ర లింకులు
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:36 AM
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా శ్రీసత్యసాయి జి ల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ (45) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్‌ఐఏ సమాచారంతో పోలీసులు అప్రమత్తం
నూర్ మహమ్మద్‌పై నిఘా.. ‘ఉపా’ కేసు.. అరెస్ట్
నిషేధిత సంస్థలతో నిందితుడికి సంబంధాలు
ధర్మవరం/కదిరి, ఆగస్టు 16(ఆంద్రజ్యోతి): ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా శ్రీసత్యసాయి జి ల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ (45) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశామని ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప శనివారం తెలిపారు. పట్టణంలోని లోనికోటలో కొత్వాల్ నూర్ మహమ్మద్ కుటుంబం నివసిస్తోంది. మార్కెట్ వీధిలోని బిరియానీ సెంటర్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ట్లు కొన్నాళ్ల కిందటే ఐబీ, ఎన్‌ఐఏ గుర్తించి, స్థానిక పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టారు. ఆధారాలు సేకరించి, 4 రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూప్‌లలో నూర్ మహమ్మద్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. అతని ఇంట్లో సోదా చేసి మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు, ఉర్దూ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. అతడు పలు నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో ఉం టూ, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
పాతికేళ్లుగా ఇక్కడే..!
నూర్ మహమ్మద్ పాతికేళ్లుగా ధర్మవరంలోని వివిధ హోటళ్లలో వంట మనిషిగా పని చేశాడు. ప్రస్తుతం సల్మాన్ బిరియానీ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పదో తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదివాడు. చదువు మానేశాక.. ధర్మవరం తిరిగి వచ్చాడు. టీ స్టాల్ ప్రారంభించి, సాగడం లేదని మూసేశాడు.
కడప జైలుకు తరలింపు
అరెస్టు చేసిన నూర్ మహమ్మద్‌ను ధర్మవరం పోలీసులు శనివారం రాత్రి కదిరి న్యాయాధికారి పి.లోక్‌నాథ్ ఎదుట హాజరుపరిచారు. తొలుత ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో అతడికి వైద్య పరీక్షలు చేయించారు. అతనిపై క్రైమ్ నంబర్ 170/2025 కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎ్‌స సెక్షన్‌లు 152, 196, క్లాస్1, 196(2), ఉపా చట్టంలోని 13,38,39 సెక్షన్ల కింద నమోదు చేశారు. న్యాయాధికారి నిందితుడికి ఈ నెల 29వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని భారీ బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
మరో యువకుడూ?
ధర్మవరంలోని ఎర్రగుంటకు చెందిన ఆటో డ్రైవర్ రియాజ్ శుక్రవా రం రాత్రి ‘ఐ లవ్ పాకిస్థాన్’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతరులు పెట్టిన పోస్టును తాను షేర్ చేశానని విచారణ లో రియాజ్ చెప్పాడు. దీంతో పోలీసులు మందలించి విడిచిపెట్టారు.