అప్పులబాధతో విషం తాగి వ్యక్తి బలవన్మరణం
ABN , Publish Date - May 18 , 2025 | 10:59 PM
అప్పులబాధతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కోడుమూరు రూరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): అప్పులబాధతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని లద్దగిరి గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన చింతచిగురు రామదాసు కొడుకు చింతచిగురు రంగన్న(35). ఎకరా పొలంలో తండ్రీకొడుకులిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. పనులు లేని సమయంలో రంగన్న కూలీ పనులకు వెళ్తూ భార్యా, నలుగురు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే వ్యవసాయం, కుటుంబ అవసరాలకు రంగన్న రూ.3లక్షలు అప్పులు చేశాడు. వీటిని ఎలా తీర్చాలోనని మదన పడుతుండేవాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం పొలం వద్ద మద్యంలో విషం కలుపుకొని తాగాడు. సమాచారం అందుకున్న తండ్రి రామదాసు, భార్య సుభాత అక్కడికి చేరుకొని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం రంగన్న మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి రామదాసు ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.