Man Brutally Murdered: కారుతో ఢీకొట్టి కత్తులతో మెడ నరికి
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:24 AM
పాతకక్షలతో ఓ వ్యక్తిని దుండగులు నడిరోడ్డుపై మెడ నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో హతుడు పాత నేరస్థుడు కాగా, నలుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఏలూరు జిల్లాలో పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
ఏలూరు క్రైం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): పాతకక్షలతో ఓ వ్యక్తిని దుండగులు నడిరోడ్డుపై మెడ నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో హతుడు పాత నేరస్థుడు కాగా, నలుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారి కథనం మేరకు.. ఏలూరు పాములదిబ్బ ప్రాంతానికి చెందిన ముంగి ఎర్రబాబు(35)పై అనేక ఇళ్ల దొంగతనాల కేసులున్నాయి. పోక్సో కేసులో ఎర్రబాబు మూణ్నెల్లు రిమాండ్ ఖైదీగా ఉండి.. పది రోజుల క్రితమే బయటికొచ్చాడు. ఈ కేసుకు సంబంధించిన యువతి బంధువులు ఎర్రబాబుపై ప్రతీకార ధోరణితో ఉన్నారు. ఇటీవల ఒక వేడుకలో ఇరువర్గాలకూ గొడవ జరిగింది. ‘నీ అంతు చూస్తా’’నంటూ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్నేహితుడు తడికలపూడికి చెందిన జట్టి సుధాకర్‌తో కలిసి ఎర్రబాబు తన బైక్‌పై శనివారం ఉదయం కోడి పందేలకు వెళ్లారు. తిరిగొస్తుండగా, దెందులూరు మండలం వీరభద్రపురం సమీపంలో ఒక కారు వీరి బైకును ఢీకొంది. ముసుగులు ధరించి ఉన్న నలుగురు ఎర్రబాబు వెంటపడి కత్తితో దాడి చేసి చంపేశారు.
తర్వాత అదే కారులో విజయవాడవైపు పరారయ్యారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఎర్రబాబును పాములదిబ్బకే చెందిన దాసరి కుమార్‌రాజా, అశోక్, దుర్గ, లలిత, రవి, ఏసురత్నం, విజయ్, దావీదు మరికొందరు కక్షగట్టి హతమార్చారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఎర్రబాబు ఒక యువతితో సహజీవనం చేస్తున్నాడని, దీనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని తెలిపారు. ఎర్రబాబుతో ఇటీవల వారు గొడవపడ్డారని ఈ నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. మరోవైపు హత్య వెనుక సుధాకర్ పాత్ర ఉండి ఉంటుందని ఆరోపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన సుధాకర్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.