Share News

Kidney Transplant Scam: కిడ్నీ మార్పిడి పేరిట లక్ష వసూలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:09 AM

వైద్యుడినంటూ కిడ్నీ బాధితుడి కుటుంబాన్ని మోసగించిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

Kidney Transplant Scam: కిడ్నీ మార్పిడి పేరిట లక్ష వసూలు

  • విశాఖలో బెజవాడ వాసి అరెస్టు.. అతడిపై ఇప్పటివరకూ 33 కేసులు

మహారాణిపేట(విశాఖపట్నం) డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైద్యుడినంటూ కిడ్నీ బాధితుడి కుటుంబాన్ని మోసగించిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ మణికంఠ చందోలు కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోక్షిత్‌ రామ్‌(5)కు కిడ్నీ సమస్య తలెత్తింది. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులు ఆర్థిక సహాయం కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పత్రికా ప్రకటన ఇచ్చారు. విజయవాడ కరకట్ట ప్రాంతానికి ఇమంది జ్యోతి శివశ్రీ(37) ఆ ప్రకటన చదివి, అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌చేసి బాలుడి తండ్రి రామ్‌జీతో మాటలు కలిపాడు. వైద్యశాఖ నుంచి మాట్లాడుతున్నామని, అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నమ్మబలికాడు. అనంతరం మరో నంబరు నుంచి ఫోన్‌చేసి కేజీహెచ్‌ నుంచి డాక్టర్‌ నరసింహాన్ని మాట్లాడుతున్నానని, ప్రభుత్వం నుంచి తమకు సమాచారం వచ్చిందని, బాలుడిని తీసుకురావాలని చెప్పాడు. కేజీహెచ్‌కు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులను కలిసి, డాక్టర్‌ ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. రిపోర్టులు పరిశీలించి సాయంత్రంలోగా రూ.లక్ష సిద్ధం చేసుకోవాలని, వెంటనే శస్త్రచికిత్స చేద్దామని చెప్పాడు. వారివద్ద నుంచి రూ.లక్ష తీసుకుని ఉడాయించాడు. బాధితులు ఆస్పత్రిలో ఆరా తీశారు. ఆ పేరుతో డాక్టర్‌ ఎవరూ లేరని తేలడంతో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం జ్యోతి శివశ్రీని అరెస్టు చేశారు. చీటింగ్‌, దొంగతనాలకు సంబంధించి అతనిపై 33 కేసులు ఉన్నాయని డీసీపీ వెల్లడించారు. అతడు బీటెక్‌ చదివినట్టు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 05:09 AM