Religious Conversion: ధనుంజయ్ అలియస్ ఆసిఫ్
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:08 AM
పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి పోలీసు కేసుల్లో ఇరుకున్న ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్.. ప్రేమకోసం మతం మార్చుకున్నట్టు తేలింది.
ప్రేమకోసం ఇస్లాంలోకి.. పాక్ అనుకూల నినాదాలతో హల్‌చల్
అరెస్టు చేసిన శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు
నల్లచెరువు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి పోలీసు కేసుల్లో ఇరుకున్న ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్.. ప్రేమకోసం మతం మార్చుకున్నట్టు తేలింది. శ్రీసత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్.. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడు. మతం మారితే పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారని ఇస్లాం స్వీకరించాడు. తిరుపతికి చెందిన ప్రసన్నకుమార్‌రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ముందు టైరు పేలి ఒకరోజు ప్రమాదం జరగడంతో కారు మరమ్మతు ఖర్చులు, అద్దె సొమ్ము కలిపి ప్రసన్నరెడ్డికి రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రసన్న.. అరవింద్ అనే యువకుడితో కలిసి కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్‌లో ధనుంజయను నిలదీశాడు. ‘ముస్లింల వల్ల దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయి. నువ్వు కూడా ముస్లిం’ అని రెచ్చగొట్టడంతో సహనం కోల్పోయిన ధనుంజయ.. ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు. దీన్ని ప్రసన్న సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఈ నెల 2న ‘ప్యూర్ ఫ్యాక్ట్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో పోస్టు చేశాడు. వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో స్థానికులు నల్లచెరువు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం ఆసి్‌ఫను అరెస్టు చేశారు.