Bapatla District SP B. Umamaheshwar: సీఎం కుటుంబ సభ్యులపై..అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:27 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు మార్టూరు మండలం ద్రోణాదుల వాసి
రిమాండ్‌కు తరలించినట్లు బాపట్ల ఎస్పీ వెల్లడి
బాపట్ల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం విలేకరులకు ఆ వివరాలను తెలియజేశారు. మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన వి.భాగ్యారావు.. సీఎం కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసభ్యకర పదజాలంతో సమాజంలో కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని.. అతడిపై చర్యలు తీసుకో వాలని అదే ప్రాంతానికి చెందిన గద్దె అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. భాగ్యారావును అరెస్టు చేసినట్లు చెప్పారు అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పంపేందుకు ఉపయోగించిన అతడి మొబైల్‌ను సీజ్ చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. సమావేశంలో బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, మార్టూరు సీఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.