Share News

Guntur: మల్లిక స్పైన్‌ సెంటర్‌కు 3 జాతీయ అవార్డులు

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:53 AM

గుంటూరులోని మల్లిక స్పైన్‌ సెంటర్‌ చీఫ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ జె నరేష్‌ బాబు, ఇండియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ 70వ వార్షిక జాతీయ సదస్సులో మూడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.

Guntur: మల్లిక స్పైన్‌ సెంటర్‌కు 3 జాతీయ అవార్డులు

  • జాతీయస్థాయిలో సత్తా చాటిన డాక్టర్‌ నరేష్ బాబు

గుంటూరు మెడికల్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): గుంటూరులోని మల్లిక స్పైన్‌ సెంటర్‌ చీఫ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ జె నరేష్‌ బాబు, ఇండియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ 70వ వార్షిక జాతీయ సదస్సులో మూడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఎముకలు, కీళ్ల వైద్య రంగంలో చేసిన వినూత్న పరిశోధనలకు హెచ్‌కేటీ రజా గోల్డ్‌ మెడల్‌-2024, ఎస్‌పీ మండల్‌ గోల్డ్‌ మెడల్‌-2025, ఐవోఏ గోల్డెన్‌ జూబ్లీ ఒరేషన్‌ అవార్డు-2025లు కైవసం చేసుకున్నారు. వెన్ను నొప్పితో బాధపడే వారిలో ఎవరికి ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జరీ సరైనది? అనే అంశంపై చేసిన వినూత్న పరిశోధనకు గాను ఆయనకు హెచ్‌కేటీ రజా గోల్డ్‌ మెడల్‌-2024 లభించింది. గువాహటీలోని సరుసజాయ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఐవోఏ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఇన్నోవేటివ్‌, రేషనల్‌ ఆర్థోపెడిక్స్‌ విభాగంలో రోజువారీ జీవన శైలి కార్యకలాపాలు లంబార్‌ డిస్క్‌ ఆరోగ్యం, అరుగుదల, నడుము నొప్పిపై ఎలా ప్రభావం చూపుతాయో విశ్లేషించిన పరిశోధనకుగాను ఎస్‌పీ మండల్‌ గోల్డ్‌ మెడల్‌-2025 వరించింది. ఈ అవార్డును 2026లో అహ్మదాబాద్‌లో జరిగే వార్షిక సదస్సులో ప్రదానం చేయనున్నారు. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, తద్వారా వచ్చే నరాలపై ఒత్తిడి గురించి జరిపిన పరిశోధనకుగాను ఇండియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌లో అత్యున్నత గౌరవంగా భావించే గోల్డెన్‌ జూబ్లీ ఒరేషన్‌ అవార్డు-2025ను గెలుచుకున్నారు.

Updated Date - Dec 22 , 2025 | 05:55 AM