Mana Mitra WhatsApp Governance Services: మన మిత్ర మాకు తెలియదు
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:12 AM
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ఒకటుందని ప్రజల్లో చాలా మందికి ఇప్పటికీ తెలియదు.
ప్రభుత్వ సర్వేలో 68 శాతం మంది వెల్లడి
వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో
32 శాతం మందిలో కనిపించిన భయం
స్మార్ట్‌ఫోన్లు లేవన్న వారు 30 శాతం
వినియోగించింది 20 శాతం మాత్రమే
కృష్ణా, గుంటూరులోనూ కనిపించని స్పందన
అవగాహన కల్పించడంలో వైఫల్యంఙ
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ఒకటుందని ప్రజల్లో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దాదాపు 200 రకాల సేవలు చిటికెలో అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసుకున్నా, ఆ సేవల సమాచారం ప్రజలకు లేదని ప్రభుత్వం చేసిన సర్వేలోనే వెల్లడైంది. ‘మన మిత్ర’ అనేది ఒకటి ఉందని కూడా తమకు తెలియదని 68 శాతం మంది తెలిపారు. 80 శాతం మంది ‘మేం దానిని వాడలేద’ని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని ఈ సర్వే గణాంకాలతో స్పష్టమవుతోంది. ప్రజలు కేవలం వాట్సాప్ ద్వారానే అన్ని రకాల సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ‘మన మిత్ర’ తీసుకొచ్చింది. ప్రత్యేక నంబరు ద్వారా వాట్సా్‌పలో ఫిర్యాదులు, వినతులు, విద్యుత్ బిల్లులు, హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం, మార్కుల మెమోలు పొందడం లాంటి అనేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ఈ పథకం ప్రారంభించగా టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల సమయంలో లక్షల మంది ‘మన మిత్ర’ ద్వారా మార్కులు తెలుసుకున్నారు. అయితే ఆ తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ‘మన మిత్ర’ను ప్రారంభించినప్పుడే ఇంటింటికీ వెళ్లి దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 24.72 లక్షల కుటుంబాలకు అవగాహన కల్పించారు. ఇంకా వెళ్లాల్సిన ఇళ్లు 1.4కోట్లు ఉన్నాయి. 89 వేల మంది ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే, 30 వేల మంది అసలు పాలు పంచుకోలేదు. ఇంటింటికీ వెళ్లి అవగాహన కలిగించే కార్యక్రమం అనుకున్న పద్ధతిలో జరగలేదని తాజా సర్వే వల్ల తెలుస్తోంది.
మాకు తెలియదు..: మనమిత్రపై ఫీడ్‌బ్యాక్ కోసం ప్రభుత్వం 20 లక్షల మందికి ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేసింది. అందులో 1.45లక్షల మంది స్పందించారు.
ఆ జిల్లాల్లోనూ తెలియదట!
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు లాంటి జిల్లాల్లో వాట్సాప్ గవర్నెన్స్ అంటే తెలియకపోవచ్చులే అనుకోవచ్చు. కానీ స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా వినియోగించే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కూడా వాట్సాప్ గవర్నెన్స్ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాపట్ల జిల్లాలో 73.3 శాతం మందికి, కృష్ణాలో 73.1 శాతం మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 72.5 శాతం మందికి, కోనసీమలో 72.5 శాతం మందికి, పల్నాడులో 72.1 శాతం మందికి, ఏలూరులో 71.8 శాతం మందికి వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలియదని సర్వేలో తేలింది. దాని వినియోగంలోనూ ఈ జిల్లాలే అట్టడుగున ఉన్నాయి. కోనసీమ, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో 20శాతం కంటే తక్కువ మంది ‘మనమిత్ర’ వాడుతున్నారు.
సేవలపై శాఖలకు రేటింగ్: ‘మన మిత్ర’ అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాల ఆధారంగా శాఖలకు ప్రభుత్వం రేటింగ్ ఇచ్చింది. దేవాదాయ శాఖకు 9, ఇంధన శాఖకు 9.5, వ్యవసాయ శాఖకు 9, పెన్షన్లకు 9, పరిశ్రమల శాఖకు 9, విద్యాశాఖకు 9.5, జీరో పావర్టీ (పీ4)కి 9, ఏపీ ఎస్‌ఎ్‌సడీసీకి 9, మెప్మాకు 9.5 రేటింగ్ దక్కింది. రవాణా శాఖకు అత్యల్పంగా 5 రేటింగ్ వచ్చింది. జ్ఞాన భూమికి 7, తల్లికి వందనానికి 7, వైద్యశాఖకు 7.5, జైళ్ల శాఖకు 7.5 రేటింగ్ లభించింది. మొత్తంగా శాఖల సేవలకు కలిపి 8.4 రేటింగ్ వచ్చింది.