Military Funeral: మేజర్ తేజ్ భరద్వాజ్‌కు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:17 AM
రాజస్థాన్‌లో సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ మృతి చెందిన మేజర్ తేజ్ భరద్వాజ్ అంత్యక్రియలు బుధవారం గుంటూరులో అధికార లాంఛనాలతో నిర్వహించారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
గుంటూరు (తూర్పు), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ మృతి చెందిన మేజర్ తేజ్ భరద్వాజ్ అంత్యక్రియలు బుధవారం గుంటూరులో అధికార లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాల్లో తూటాలు పేల్చి తేజ్‌భరత్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి ఆర్మీ అధికారులు, స్థానిక అధికారులు, గుంటూరు నగర వీధుల మీదుగా అంతిమ యాత్ర నిర్వహించగా, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొని.. తేజ్ భరత్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. ప్రజలు తేజ్ పార్థివ దేహానికి పూలు జల్లుతూ నివాళులర్పించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహమ్మద్, గళ్లా మాధవి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాసరావు, బీజేపీ, వైసీపీ నాయకులు.. మేజర్ తేజ్ భరత్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. అనంతరం శ్రీనివాసరావుతోటలోని కైలాసగిరిలో తేజ్ భరద్వాజ్ అంత్యక్రియలను పూర్తి చేశారు.