Share News

Electricity Bill Adjustment: విద్యుత్‌ చార్జీల్లో భారీ ఊరట

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:43 AM

విద్యుత్‌ చార్జీలు పెరిగాయి అని మాత్రమే వినడానికి అలవాటు పడ్డ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తీపి కబురు చెప్పింది.

Electricity Bill Adjustment: విద్యుత్‌ చార్జీల్లో భారీ ఊరట

  • తొలిసారి తగ్గనున్న ట్రూఅప్‌ భారం.. 923 కోట్లు వినియోగదారులకు చెల్లింపు

  • 2024-25లో వినియోగించిన యూనిట్‌కు 13 పైసలు చొప్పున వెనక్కి

  • నవంబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబరు వరకు నెలవారీ బిల్లుల్లో సర్దుబాటు

  • విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులు తగ్గిన ఫలితం

  • ఇక నుంచి ట్రూడౌన్‌

  • వైసీపీ హయాంలో అడ్డగోలుగా విద్యుత్తు కొనుగోళ్లు

  • వాటిని కట్టడి చేసిన కూటమి ప్రభుత్వం

  • త్వరలో మరో రూ.1059.75 కోట్లు ట్రూడౌన్‌

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలు పెరిగాయి అని మాత్రమే వినడానికి అలవాటు పడ్డ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తీపి కబురు చెప్పింది. వినియోగదారులపై ట్రూఅప్‌ భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. సుమారు రూ. 923.55 కోట్లను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఏపీఈఆర్‌సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎ్‌ఫపీపీసీఏ) పేర్లను మాత్రమే విన్న విద్యుత్తు వినియోగదారులు కూటమి ప్రభు త్వం వచ్చిన తర్వాత తొలిసారి ట్రూడౌన్‌ (చార్జీల తగ్గింపు)ను వింటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు దాఖలు చేసిన రూ. 2,758.76 కోట్ల ట్రూఅప్‌ మొత్తానికిగాను ఏపీఈఆర్‌సీ రూ. 1,863.64 కోట్లకు ఆమోదం తెలిపింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు రూ. 2,787 కోట్లు వసూలు చేయడంతో ఆ మొత్తం నుంచి రూ. 1,863.64 కోట్లను మినహాయించి మిగిలిన రూ. 923.55 కోట్లను విద్యుత్తు వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. 2024-25లో విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఈ ఏడాది జూన్‌ 30న విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏపీఈఆర్‌సీకి నివేదించాయి. ఆ నివేదికలను మూడు నెలల్లోపు పరిశీలించి ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సిన కాలపరిమితి ఉన్న నేపథ్యంలో శనివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.


ఎలా సర్దుబాటు చేస్తారు

ట్రూడౌన్‌ చార్జీల రూపంలో మిగిలిన రూ. 923.55 కోట్లను ఈ ఏడాది నవంబరు నుంచి 2026 అక్టోబరు వరకు విద్యుత్తు వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. యూనిట్‌కు 13 పైసలు చొప్పు న వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ప్రస్తుత బిల్లులోని యూనిట్లపై కాకుండా 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు వినియోగించిన యూనిట్లకు వర్తింప చేస్తారు. ఆ మొత్తాన్ని ప్రస్తుత బిల్లులో సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు 2024 ఏప్రిల్‌లో వినియోగదారుల 100 యూనిట్లు విద్యుత్తు వినియోగిస్తే యూనిట్‌కు 13 పైసలు చొప్పున ఆ 100 యూనిట్లకు రూ. 13లు ఈ ఏడాది నవంబరు బిల్లులో సర్దుబాటు చేస్తారు.

త్వరలో మరో వెయ్యి కోట్లకుపైగా..

రానున్న రెండు మూడు నెలల్లో మరో విడత ట్రూడౌన్‌ చార్జీలకు ఏపీఈఆర్‌సీ సిద్ధమవుతోంది. 2019-24 మధ్య కాలానికి రూ. 1059.75 కోట్ల ట్రూడౌన్‌ (చార్జీల తగ్గింపు)ను ఏపీ ట్రాన్స్‌కో ఈ ఏడాది మార్చిలో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై నిర్ణయానికి ఎలాంటి కాలపరిమితి లేదు. అయితే వీటిపై రానున్న ఒకటి రెండు నెలల్లోనే ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 2019-24 మధ్య పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీఈఆర్‌సీ అనుమతించిన ఖర్చు.. వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్‌ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. అప్పట్లో కోవిడ్‌ తదితర కారణాల వల్ల అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఆ నిధులు అలాగే మిగిలిపోవడంతో వాటిని ట్రూడౌన్‌ కింద వినియోగదారులకు సర్దుబాటు చేయనున్నారు.


ఏమిటీ ట్రూఅప్‌

విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కంలు) విద్యుత్తు కొనుగోలు, పంపిణీకి సంబంధించి అయ్యే ఖర్చులను లెక్కించి, దాని ఆధారంగా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన ధరలను విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ణయిస్తుంది. ఏపీఈఆర్‌సీ అనుమతించిన మొత్తం కంటే డిస్కంలకు అయిన వాస్తవ ఖర్చు ఎక్కువగా వస్తే దాన్ని లెక్కించి ట్రూ అప్‌ ఛార్జీల రూపంలో వసూలు చేసుకునేందుకు అనుమతిస్తుంది. వైసీపీ హయాంలో అడ్డగోలు ధరలకు విద్యుత్తును కొనుగోళ్లు చేయడంతో ఈ ట్రూఅప్‌ చార్జీల భారం భారీగా పడింది.

ట్రూడౌన్‌ అంటే..

అనుమతించిన దానికంటే డిస్కంలకు అయిన వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటే మిగులు మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశిస్తుంది. దీన్నే ట్రూడౌన్‌ అంటారు. విద్యుత్తు కొనుగోళ్ల ధరల విషయంలో కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంతో డిస్కంలు తొలిసారి ట్రూడౌన్‌ చార్జీలను అమలు చేసే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Sep 28 , 2025 | 03:46 AM