Road Reconstruction: పల్లె రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:06 AM
రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు నోచుకోని పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించేందుకు...
2,123 కోట్లతో 4,007 కి.మీ. మేర నిర్మాణం
కేంద్ర పథకం సాస్కి నిధులతో పనులు
పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం శ్రీకారం
మొత్తం 12,999 పల్లె రహదారులు
157 నియోజకవర్గాలు.. 484 మండలాల్లో
నేడో, రేపో పరిపాలనా ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు నోచుకోని పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్(సాస్కి) నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 12, 999 రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశా రు. రూ.2,123 కోట్లతో 4,007 కి.మీ. మేర పల్లె రోడ్లను నిర్మించనున్నారు. పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ ఒకట్రెండు రోజుల్లో ఈ పనులకు పరిపాలన మంజూరు ఉత్తర్వులు జారీ చేయనుంది. 157 నియోజకవర్గాల్లోని 484 మండలాల్లో పనులు చేపట్టనున్నారు. జియో రూరల్ రోడ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా దెబ్బతిన్న రోడ్ల సమాచారాన్ని క్రోడీకరించి పనులు మంజూరు చేస్తున్నా రు. గతంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు నిధులు కావాలని ప్రతిపాదనలిస్తే ఆ మేరకు పనులు మంజూరు చేసేవారు. అయుతే కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అక్కడ పనులు జరిగేవి కావు. పెద్దగా జనాలు ప్రయాణం చేయని రోడ్లను బాగు చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఉండేది. దీంతో రియల్ టైమ్ వాస్తవిక పరిస్థితిని తెలుసుకుని రోడ్లను నిర్మించాలని పవన్ కల్యాణ్ ఆదేశించడంతో ఆ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
పవన్ ఆదేశాలతో..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని రోడ్లున్నాయి? అవి ఏ స్థితి లో ఉన్నాయి? బాగా దెబ్బతిన్నవి ఎన్ని? బాగా ఉన్నవి ఎన్ని? ఒక మోస్తరుగా ఉన్న రోడ్లెన్ని?.. తదితర సమాచారం ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పం చాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రికార్డుల్లోనే ఉంది. ఎప్పుడైనా వాటి స్థితిగతుల తాజా సమాచారం తెలుసుకోవాలంటే క్షేత్ర స్థాయిలో ఉన్న ఏఈ దాకా ఫైల్ నడపాలి. అయితే రోడ్ల అభివృద్ధికి మనకున్న పరిమితమైన వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే రోడ్ల సమాచారం రియల్‌టైమ్‌లో అవసరమవుతుంది. ప్రజాప్రతినిధులు అడిగిన రోడ్ల ను మంజూరు చేయడం ఇప్పటి వరకూ ఆనవాయితీగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి రోడ్ల పనులు మంజూరు చేసుకుంటేనే ఆయా రోడ్లు బాగుపడుతున్నాయి. ఈ నేపథ్యం లో గ్రామీణ రోడ్ల వాస్తవిక పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఈఎన్‌సీ, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పంచాయతీరాజ్ రోడ్ల పూర్తి డేటాను జియో రూరల్ రోడ్స్ యాప్ ద్వారా సేకరించారు. దానిని జియో రూరల్ రోడ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(జీఆర్‌ఆర్‌ఎంఎస్) పోర్టల్‌కు అనుసంధానించారు. ఆయా రోడ్లకు డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ పంచాయతీరాజ్(డీఆర్‌ఆర్‌పీ) కోడ్ నంబర్లు కూడా కేటాయించారు.
వెబ్‌సైట్‌లో రోడ్ల వివరాలన్నీ..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో గ్రామానికి, మరో గ్రామానికి కనెక్టివిటీ ఉన్న రోడ్లు రాష్ట్రంలో సుమారు 31,332 ఉన్నాయని గుర్తించారు. 67 వేల కి.మీ. మేర ఉన్న ఈ రోడ్ల వివరాలన్నీ ఇక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. గతంలో కొన్ని రోడ్లను ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) ద్వారా చేపట్టారు. పీఎంజీఎస్‌వై రోడ్లన్నింటికీ డీఆర్‌ఆర్‌పీ కోడ్‌లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రోడ్లకు అవే కోడ్‌లను కొనసాగించి, మిగిలిన రోడ్లకు కొత్త కోడ్ నంబర్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 47,267 నివాసిత ప్రాంతాల్లో ఈ కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకోసారి ఆయా రోడ్ల స్థితిని స్థానిక ఇంజనీర్లు అప్‌డేట్ చేస్తారు. రోడ్ల ఫొటోలను కూడా వెబ్‌లో ఉంచుతారు. గ్రామాల్లో ఏయే రోడ్లు ఎలా ఉన్నా యి? ఆయా రోడ్లు నిర్మించిన ప్రాంతంలో నేల స్వ భావం ఏంటి? తారు, సిమెంట్, గ్రావెల్, ఎర్త్ రోడ్లు లో ఏ తరహా రోడ్లు? అన్న సమాచారం కూడా అం దుబాటులో ఉంచుతున్నారు. రోడ్లను బ్యాడ్, ఫెయిర్, వెరీ ఫెయిర్, గుడ్, ఎక్స్‌లెంట్ అనే కేటగిరీలుగా విభజిస్తున్నారు.
పోర్టల్ ఆధారంగా మంజూరు
కేంద్ర ప్రభుత్వం సాస్కి పేరుతో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే విధానంలో వడ్డీరహిత రుణాలను అందిస్తోంది. ఆర్‌అండ్‌బీ, టూరిజం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రోడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,123 కోట్లను సమీకరించుకోనున్నారు. ఈ నిధులను గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు వినియోగిస్తారు. 67 వేల కి.మీ. మేర రోడ్లలో... పోర్టల్ ఆధారంగా బాగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి రోడ్ల పనులను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.