Share News

షెల్టర్‌ జోన్‌లో.. మేజర్‌ ఆపరేషన్‌!

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:27 AM

మావోయిస్టుల అరెస్టుతో ఉమ్మడి కృష్ణాజిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 32 మంది పట్టుబడ్డారు. కానూరు న్యూ ఆటోనగర్‌లోని ఓ భ వనంలో 28 మంది, రామవరప్పాడులో నలుగురు 20 రోజులుగా తలదాచుకుంటున్నారు. పక్కాసమాచారంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి పట్టుకున్నాయి. విషయం బయటకురావడంతో బెజవాడ వాసులు భయాందోళనకు గురయ్యారు. మావోయిస్టు ఉద్యమంతో నాటి తరం నాయకులకు ఉన్న సంబంధాలు, వెలుగు చూసిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు షెల్టర్‌ జోన్‌లో జరిగిన వాటిలో ఇదే మేజర్‌ ఆపరేషన్‌గా భావిస్తున్నారు.

షెల్టర్‌ జోన్‌లో.. మేజర్‌ ఆపరేషన్‌!

- విజయవాడ సమీపంలోని కానూరులో సంచలన ఘటన

- న్యూ ఆటోనగర్‌లో 28 మంది, రామవరప్పాడులో నలుగురు మావోయిస్టుల పట్టివేత

- సుమారు 20 రోజులుగా తలదాచుకుంటున్నట్టు సమాచారం

- గతంలో ఒకరిద్దరిని పట్టుకున్నా.. ఆధారాలు లేక వదిలేసిన పోలీసులు

- 2006లో ఆటోనగర్‌లో రాకెట్‌ లాంచర్ల పట్టివేతతో ఉలిక్కిపడిన బెజవాడ

- అదే ఏడాది రాకెట్‌ లాంచర్లు, డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ అనేక సార్లు దిగుమతి

- మావోయిస్టు ఉద్యమంలో నాడు కీలకపాత్ర పోషించిన జిల్లా వాసులు

మావోయిస్టుల అరెస్టుతో ఉమ్మడి కృష్ణాజిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 32 మంది పట్టుబడ్డారు. కానూరు న్యూ ఆటోనగర్‌లోని ఓ భ వనంలో 28 మంది, రామవరప్పాడులో నలుగురు 20 రోజులుగా తలదాచుకుంటున్నారు. పక్కాసమాచారంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి పట్టుకున్నాయి. విషయం బయటకురావడంతో బెజవాడ వాసులు భయాందోళనకు గురయ్యారు. మావోయిస్టు ఉద్యమంతో నాటి తరం నాయకులకు ఉన్న సంబంధాలు, వెలుగు చూసిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు షెల్టర్‌ జోన్‌లో జరిగిన వాటిలో ఇదే మేజర్‌ ఆపరేషన్‌గా భావిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం/విజయవాడ):

షెల్టర్‌ జోన్‌గా ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లాలో మావోయిస్టులను పట్టుకోవడంలో జరిగిన అతి పెద్ద ఆపరేషన్‌గా మంగళవారం నాటి ఘటన నిలిచింది. కానూరు ఆటోనగర్‌ అనేది బెజవాడ ఆటోనగర్‌ను ఆనుకుని ఉంటుంది. విద్యుత సబ్‌స్టేషన్‌ రోడ్డుకు ఆరవ అంతర్గత రోడ్డుగా ఉన్న జీ ప్లస్‌ 3 భవనంలో తలదాచుకున్న 28 మంది, రామవరప్పాడులో నలుగురు మావోయిస్టులను గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బలగాలు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. గతంలో ఇంత పెద్ద సంఖ్యలో విజయవాడలో కానీ, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కానీ మావోయిస్టులను పట్టుకున్న ఉదంతాలు లేవు. విజయవాడ నగరాన్ని మావోయిస్టులు కొన్ని దశాబ్దాల కాలంగా షెల్టర్‌జోన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించిన దాఖలాలు లేవు కానీ, షెల్టర్‌గా మాత్రం ఉపయోగించు కుంటున్నారు. మావోయిస్టుల సానుభూతిపరులన్న అనుమానాలతో పూర్వం అరెస్టులు జరిగినా ఆ తర్వాత సహేతుక ఆధారాలు లేక వారిని వదిలేయటం జరిగింది. పూర్వపు రోజుల్లో నక్సల్స్‌ కదలికలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉండేవి. ప్రధానంగా నక్సల్స్‌ తమ సాహిత్యాన్ని గ్రామాల్లో ఉన్న అభ్యుదయవాదులకు అందించటం జరిగేది. అభ్యుదయవాదులు ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం ద్వారా ప్రజలకు తెలియజేసేవారు. అప్పట్లో ఇప్పుడున్నంత దృష్టి పోలీసులకు ఉండేది కాదు. దీంతో నక ్సల్స్‌ తమ కార్యక్రమాలను చాపకిందనీరులా చేసుకుంటూ పోయేవారు.

నాడు ఉలిక్కిపడిన బెజవాడ

2006-07 మధ్య కాలంలో ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ వాహనంలో విజయవాడకు వచ్చిన రాకెట్‌ లాంచర్ల విడిభాగాలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు ట్రాన్స్‌పోర్ట్‌ చేసిన రాకెట్‌ లాంచర్లు ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ గోడౌన్‌లో దిగుమతి అయ్యాయి. అయినా వాటిని తీసుకోవటానికి కొద్ది రోజులు ఎవరూ రాలేదు. ఈ సమాచారం పోలీసులకు తెలియటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కానీ అవి రాకెట్‌ లాంచర్ల విడిభాగాలని బయట ప్రపంచానికి తెలిసింది. ఈ పరిణామంతో విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే సందర్భంలో మహబూబ్‌నగర్‌, ప్రకాశంజిల్లాలో రాకెట్‌ లాంచర్ల డంప్‌లను పోలీసులు సీజ్‌ చేశారు. దీంతో విజయవాడకు ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపిన రాకెట్‌ లాంచర్ల విడిభాగాలను తీసుకువెళ్లటానికి మావోయిస్టులు జాప్యం చేశారు. ఈ లోపే సమాచారం బయటకు రావటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లో దొరికిన రాకెట్‌ లాంచర్లు కూడా విజయవాడకు ముందుగా రవాణా అయ్యాయని అప్పట్లో పోలీస్‌ వర్గాలు నిర్ధారించాయి. 2006లో చెన్నై నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్‌ లాంచర్ల విడిభాగాలను పొద్దుటూరుకు చేర్చి అక్కడి నుంచి అచ్చంపేట గిద్దలూరులలో ఎంపిక చేసిన ప్రాంతాలకు మావోయిస్టులు తరలించారు. ఆయా ప్రాంతాల్లో సీజ్‌ చేసిన వాటిలో భారీ సంఖ్యలో రాకెట్‌ లాంచర్ల విడిభాగాలతో పాటు జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఇవి కనుక వారి చేతికి చేరి ఉంటే భారీ స్థాయిలో మారణహోమాలు జరిగి ఉండేదని తెలిసింది. అదృష్టవశాత్తూ విజయవాడతో సహా, విజయవాడ నుంచి బయట ప్రాంతాలకు రవాణా అయినవన్నీ కూడా అన్నల చేతికి వెళ్లేలోపే పోలీసులు పట్టుకుని సీజ్‌ చేయటంతో అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చేరకుండా నిరోధించటం జరిగింది.

కొండపల్లి సీతారామయ్య అంటే అభిమానంతో..

నాటి నక్సలైట్‌ ఉద్యమ అగ్రనాయకుడు కొండపల్లి సీతారామయ్య గుడివాడ సమీపంలోని జనార్థనపురానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ద్వారా సాయం పొందిన వారు, ఉన్నతస్థితికి ఎదిగినవారు ఆయన అనుచరులుగా ఉండి నేరుగా ఉద్యమంలో పాల్గొనకపోయినా సానుభూతిపరులుగా ఉండేవారు. మావోయిస్టులు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నపుడు విజయవాడ, గుడ్లవల్లేరు, ఘంటసాల, గూడూరు, కోడూరు, తదిత ప్రాంతాల్లో కొద్దిరోజులపాటు తలదాచుకునేవారు. మావోయిస్టు వ్యవస్థను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి తుదముట్టిస్తామని కేంద్రప్రభుత్వం తరచూ ప్రకటనలు చేస్తుండటం, ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచడం, దొరికిన వారిని దొరికినట్లుగా ఎన్‌కౌంటర్‌ చేస్తుండటంతో మావోయిస్టులు కృష్ణాజిల్లాకు తరలివచ్చారనే ప్రచారం జరుగుతోంది.

గతంలో చల్లపల్లి శ్రీనివాసరావుపై నిఘా

మావోయిస్టు ఉద్యమానికి అనుబంధంగా కోడూరుకు చెందిన చల్లపల్లి శ్రీనివాసరావు దివిసీమను కేంద్రంగా చేసుకుని జనశక్తి పేరుతో ఉద్యమాలు నడిపేవారు. ఆయనను 20 ఏళ్లక్రితం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు పెనమలూరు, ఉయ్యూరు సరిహద్దులో పట్టుకున్నాయి. ఆయనను మచిలీపట్నంలోని జనశక్త్తినగర్‌కు తీసుకువచ్చి మావోయిస్టుల సాహిత్యం, తుపాకీ తదితరాలు ఆయన వద్ద ఉంచి ఎన్‌కౌంటర్‌ చేసేంతగా పోలీసులు హడావిడి చేశారు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో ఆయనను ఎన్‌కౌంటర్‌ చేయకుండా అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన వృద్ధాప్యంతో మృతి చెందారు.

గత డిసెంబరులో ఐదుగుళ్లపల్లివాసి ఎన్‌కౌంటర్‌

గూడూరు మండలం ఐదుగుళ్లపల్లికి చెందిన పృథ్వీ మోహనరావు అలియాస్‌ కార్తీక్‌దాదా(65) ఒడిశా రాష్ట్ర మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన గత ఏడాది డిసెంబరు 11వ తేదీన ఒడిశాలోని నారాయణపూర్‌ జిల్లా కుమ్మంలోని లక్‌వేద వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆయన మృతదేహాన్ని ఐదుగుళ్లపల్లికి బంధువులు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు.

భయం గుప్పెట్లో న్యూ ఆటోనగర్‌

కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు పట్టుబడటంతో పాత, కొత్త ఆటోనగర్‌ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆటోనగర్‌, కానూరు న్యూ ఆటోనగర్‌ వరకు అనేక పరిశ్రమలు ఉన్నాయి. సుమారు 20 వేల యూనిట్లు ఆటోనగర్‌లోనే ఉండడంతో స్థానికులు, బయట ప్రాం తాలకు చెందిన సుమారు లక్షమంది ఇక్కడి ప్రతి రోజు ఉపాధి పొందుతారు. రెసిడెన్షియల్‌, ఇండస్ర్టీస్‌ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో పాటు పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడే ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో మావోయిస్టులు 20 రోజులుగా ఇక్కడే ఉన్నారు. వారిని మంగళవారం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బలగాలు అరెస్ట్‌ చేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అసలు మావోయిస్టులు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఎన్ని రోజులు ఉండాలనుకున్నారు? ఎవరు, ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటున్నారనే సందేహాలు స్థానికుల్లో తలెత్తుతున్నాయి. ఇన్ని రోజులు వారు ఇక్కడే తలదాచుకుంటున్నా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 01:27 AM