Jagan Liquor Scam : ఆంతులేని కిక్కు లెక్క
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:16 AM
వైసీపీ పెద్దలు నడిపించిన స్కామ్‌లో అనేక పాత్రలు, పాత్రధారులు! ‘సిట్’ విచారణలో భాగంగా అందులో కొందరు నోరు తెరుస్తున్నారు.

‘ఢిల్లీ’ని తలదన్నే మద్యం కుంభకోణం
జగన్ సర్కారులో అడ్డగోలుగా దందా
సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు
ప్రభుత్వ ఖజానాకు 18 వేల కోట్ల నష్టం
ఇందులో తాడేపల్లి ప్యాలె్‌సకే వేల కోట్లు!
కీలక నేతలు, బేవరేజెస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు పాత్రధారులు
మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి సహా ఐదుగురి నుంచి ఇప్పటికే వాంగ్మూలం
‘పెద్దల’ సూచన మేరకే సరుకు ‘ఇండెంట్లు’
షాపులకు సొంత, అస్మదీయ బ్రాండ్లు మాత్రమే
కమీషన్ల కోసం మద్యం ధరల పెంపు
అమ్మకాల వివరాలు డేటా ఆపరేటర్ ద్వారా రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి చేరవేత
కమీషన్ల వసూళ్లలో ఆయనే కీలకం
వైసీపీ ఎంపీ పాత్రపైనా ఆధారాలు
ఉత్పత్తి చేసేది వాళ్లే... సరుకు వాళ్లదే! షాపులు కూడా వాళ్లవే! ఇండెంట్ పెట్టేది వాళ్లే! ఆ సరుకు పంపించేదీ వాళ్లే! ఇదీ... వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ తీరు! తవ్వే కొద్దీ బయటపడుతున్న ‘కిక్కు’ లెక్కలు! ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ‘క్వార్టర్ బాటిల్’ లాంటిదైతే, ఏపీలో వైసీపీ పెద్దలు చేసిన మద్యం కుంభకోణం ఒక ‘లిక్కర్ మాల్’ అంత పెద్దది! జగన్ ప్రభుత్వం నాటి మద్యం కుంభకోణంలో ఖజానాకు అక్షరాలా 18 వేలకోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఇందులో వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్‍కే చేరినట్టు సమాచారం.
గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు,కమీషన్ల పర్వం గురించి ‘ఆంధ్రజ్యోతి’ ఇదివరకే సవివరంగా కథనం ప్రచురించింది. తాజాగా సిట్ దర్యాప్తులో ఇది నిజమని ఆధారాలు లభించాయి. మద్యం స్కామ్‌లో కీలక పాత్రధారులు, సాక్షులు ఇటీవల సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. మద్యం కంపెనీల నుంచి ‘పెద్దల’కు కమీషన్లు చేరవేయడంలో జగన్ ప్రభుత్వంలోని ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఇప్పటిదాకా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి! ఎన్నెన్నో స్కామ్‌లు బయటపడ్డాయి. కానీ... స్కామ్‌లకు మించిన స్కామ్, ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ జగన్ హయాంలోనే జరిగింది.అది... మద్యం కుంభకోణం! వైసీపీ పెద్దలు నడిపించిన స్కామ్‌లో అనేక పాత్రలు, పాత్రధారులు! ‘సిట్’ విచారణలో భాగంగా అందులో కొందరు నోరు తెరుస్తున్నారు. మద్యం షాపుల్లో ఆర్డర్లు పెట్టినట్లు చెబుతున్న కంప్యూటర్ల నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో సీజ్ చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కల వరకూ అన్నింటినీ ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పించుకున్న ‘సిట్’ అనేక సంచలన అంశాలను గుర్తించింది. మరీ ముఖ్యంగా... ఈ స్కామ్‌లో కీలకమైన ‘స్ర్కిప్ట్’ కూడా దొరికిపోయింది. మద్యం కుంభకోణంలో వైసీపీ పెద్దలు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో కీలక స్థానంలో ఉన్న అధికారులతో మొదలుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు తమ తమ పాత్రలు పోషించారు. వీరిలో ఐదుగురు విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలాలు కీలకంగా మారాయి. వారే... ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి, రైల్వే నుంచి వైసీపీ హయాంలో వచ్చి ఎన్నికల తర్వాత తిరిగి వెళ్లిన రమేశ్‌కుమార్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూష! వీరిలో సత్యప్రసాద్ న్యాయమూర్తి ఎదుట సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. స్కామ్ జరిగిన తీరును పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 18 వేలకోట్ల నష్టం జరిగినట్టు దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది.
ఇదీ... స్కామ్ రూటు!
జగన్ వచ్చీ రాగానే మద్యం పాలసీ మార్చేశారు. ప్రైవేటు దుకాణాల స్థానంలో ‘ప్రభుత్వ’ దుకాణాలు తెరిచారు. మొత్తం స్కామ్‌కు అదే మూలం. సాధారణంగా... షాప్ సూపర్‌వైజర్ తమకు కావాల్సిన సరుకు ఏది, ఎంత అన్నది ఆన్‌లైన్‌లో డిపో మేనేజర్‌ను అడగాలి! కానీ... ఇక్కడ సూపర్‌వైజర్ పాత్రను ‘సేల్స్’కు మాత్రమే పరిమితం చేశారు. ‘ఇండెంట్ పెట్టడం’ అనే దశను పూర్తిగా ఎత్తేశారు. తమ సొంత బ్రాండ్లు, తమకు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన బ్రాండ్లను మాత్రమే దుకాణాలకు పంపించేవారు. ‘ఈ రోజు ఫలానా సరుకు అమ్మాలి’ అంటూ ఎప్పటికప్పుడు జాబితా పంపించేవారు. దాని ప్రకారమే సేల్స్ నడిచేవి. వినియోగదారులు ఇతర బ్రాండ్లు అడిగితే ‘అవి లేవు. ఉన్నవి ఇవే’ అని తమ సరుకును మాత్రమే అంటగట్టేవారు. ‘మా బ్రాండ్లు ఎందుకు అమ్మడం లేదు’ అని ప్రముఖ కంపెనీలు పైస్థాయిలో ప్రశ్నిస్తే.. ‘మీ సరుకు ఎవరూ అడగడం లేదు’ అని చెప్పేవాళ్లు. ఇలా... సొంత బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ బ్రాండ్ మద్యం ఎంత అమ్ముడయిందనే వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూష ద్వారా రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి చేరేవి. దాని ఆధారంగా... ఎవరి నుంచి ఎంత కమీషన్ వసూలు చేయాలో లెక్కలు సిద్ధం చేసేవాళ్లు. ప్రభుత్వం నుంచి పేమెంట్ జరగ్గానే... కంపెనీలు కమీషన్‌ను చెల్లించేవి. ‘ఫలానా రోజు, ఫలానా చోటికి రండి. అక్కడ మిమ్మల్ని కలిసే వ్యక్తికి కమీషన్ ఇచ్చివెళ్లండి’ అని చెప్పగానే... అత్యంత నాటకీయంగా కమీషన్ల చెల్లింపులు జరిగేవి. దీనిపై గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’ సవిరంగా కథనం ప్రచురించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయించాలనే పాలసీ తెచ్చిందే ఈ స్కామ్ కోసం. అదే ప్రైవేటు మద్యం దుకాణాలు ఉంటే ఇది జరగదు. దుకాణదారు తమకు ఏ సరుకు కావాలో ఇండెంట్ పెడతాడు. డబ్బులు కడతాడు. సరుకు తెచ్చుకుని... అమ్ముకుంటాడు. ఇక్కడ కమీషన్ ప్రస్తావనే లేదు.
‘జగన్ పాలసీ’లో జరిగింది దీనికి పూర్తిగా భిన్నం. అసలు ధర వెయ్యి రూపాయలైతే... వీళ్లు నిర్ణయించిన ధర రూ.1200. తమకు కావాల్సిన సరుకును విక్రయించడం... ఆ తర్వాత ఆ కంపెనీలకు బిల్లులు చెల్లించడం... అదనంగా నిర్ణయించిన ధరను కమీషన్ రూపంలో పుచ్చుకోవడం!
ఐటీ సలహాదారు.. మద్యం కలెక్షన్లు!
రాష్ట్రచరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో సలహాదారులను నియమించుకున్న జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని పెట్టుకున్నారు. రాజ్ కసిరెడ్డి సలహాలతో రాష్ట్ర ఐటీ రంగం ఏ మేరకు అభివృద్ధి చెందిందో కానీ మద్యం కమీషన్ల వసూళ్లలో మాత్రం ఆయన పాత్ర కీలకం. మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్లు సీఐడీ నమోదు చేసిన కేసులోనే ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అయితే దర్యాప్తులో జాప్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఐజీ ర్యాంకు అధికారి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏడుగురితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆధారాలు సేకరిస్తున్న తరుణంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల విజయవాడలో సీఐడీ విచారణకు వచ్చినప్పుడు.. మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం అన్ని విషయాలు చెప్పలేనని, త్వరలో అన్నీ చెబుతానని అన్నారు. దీంతో మరోసారి రాజ్ కసిరెడ్డి పాత్ర చర్చనీయాంశంగా మారింది. సిట్ అధికారులకు ఓ స్పష్టత వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మద్యం డిస్టిలరీస్ నుంచి ఆర్గనైజర్లు వసూలు చేసిన మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి ద్వారా పార్టీలో కీలకనేతకు, అక్కడి నుంచి బిగ్‌బా్‌సకు చేరేదని చైన్ లింక్‌లో కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది.
కసిరెడ్డిపై ఫిర్యాదు
లీలా మద్యం కంపెనీ యాజమాన్యాన్ని రాజ్ కసిరెడ్డి బెదిరించి ఆ కంపెనీని లాక్కున్నట్లు సీఐడీకి ఫిర్యాదు అందింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో లీలా కంపెనీ అనుకూలంగానే ఉంది. ఎస్‌ఎన్‌జే ఉద్యోగి ఒకరు లీలాలో డైరెక్టర్‌గా చేరారు. కొంతకాలానికి బెదిరించి మొత్తం లాగేసుకుని, ఆ బ్రాండ్లు కూడా వైసీపీ పెద్దలు విక్రయించుకున్నట్లు ఫిర్యాదులో యజమాని పేర్కొన్నారు. ఈ వ్యవహరంపైనా దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు.
ఆ ముగ్గురూ కీలకం
బేవరేజెస్ కార్పొరేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన అనూష పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఆమెను విచారించిన అధికారులు ఇటీవల కోర్టులో వాంగ్మూలం రికార్డు చేయించారు. ఎంత పెద్ద భవనం తలుపులు తెరవాలన్నా... చిన్న తాళంచెవి కావాల్సిందే! అలాంటి ‘కీ’... ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్! కీలకమైన ఈ-మెయిల్స్‌ను ఆమే నిర్వహించేవారని... సేల్స్ సమాచారం రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి ఆమె ద్వారానే చేరేదని వెల్లడైంది. నిబంధనల ప్రకారం మద్యం షాపుల్లో పనిచేసే సూపర్ వైజర్లు ఏ రకమైన లిక్కర్ కావాలో ఇండెంట్ పెడతారు. అయితే సూపర్ వైజర్ల ద్వారా గాక నేరుగా మద్యం డిపోల మేనేజర్లతో ఇండెంట్ పెట్టించారు. ఏ రకమైన బ్రాండ్లకు ఇండెంట్లు పెట్టాలో బేవరేజెస్ కార్పొరేషన్‌లో పనిచేసిన రమేశ్‌కుమార్ రెడ్డి సూచనలు ఇచ్చేవారు. రోజువారీ మద్యం అమ్మకాల వివరాలను అనూష హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి సొంత మనిషి సైఫ్‌కు చేరవేసేవారు. వాటి ఆధారంగా మద్యం కంపెనీల నుంచి కసిరెడ్డి కమీషన్లు వసూలు చేసేవారు. ఆర్నెల్ల క్రితం పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమెను ఏరికోరి ఆ పోస్టులో నియమించారనే విషయం కూడా బయట పడింది.
18 వేలకోట్ల నష్టం
దశలవారీగా మద్య నిషేఽధం అమలు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ప్రభుత్వ దుకాణాలు పెట్టించి ఊరూపేరూ లేని బ్రాండ్లను అధిక ధరలకు అమ్మించారు. ఇప్పటి వరకూ సీఐడీ, సిట్ సేకరించిన ఆధారాల్లో విస్తుపోయే అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లలో ‘మద్యం’లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.18,000 కోట్ల వరకూ నష్టం వాటిలినట్టు దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో దిగువ, మధ్య స్థాయి వైసీపీ నేతలు, అధికారులకు 4 వేల కోట్ల కమీషన్లు వెళ్లగా... డిస్టిలరీలకు మరో 4 వేల కోట్లు దాకా వాటా ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన 10 వేల కోట్లు ఎక్కడికి వెళ్లిందన్నది పెద్ద పజిల్! ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్లినట్టు తెలుస్తోంది. కూలీలు, నిరుపేదలు తాగే చీప్ లిక్కర్ నుంచి కూడా వేల కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో దండుకున్నారు. తాడేపల్లి ప్యాలె్‌సలోని గదులను నోట్ల మూటలతో నింపినట్లు తెలుస్తోంది. అందుకు ఒక పార్లమెంటు సభ్యుడితో పాటు మాజీ ఎంపీ కూడా క్రియాశీలంగా వ్యవహరించినట్లు ఆధారాలు బయట పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించి దోపిడీ జరిగినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. నిందితుల బంధువుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా తర్వాతి అడుగు తాడేపల్లి ప్యాలె్‌సలో వేసేందుకు ప్రభుత్వం సిగ్నలిస్తే సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లినట్లు... ఇక్కడ మాజీ సీఎం జైలుపాలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఐఏఎస్‌కూ వాటా
మద్యం కుంభకోణంలో ఎవరి వాటా ఎంత అన్నది సిట్ అధికారుల విచారణలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వెల్లడించినట్లు తెలిసింది. వారిద్దరూ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకున్న అధికారులు మరింత లోతుగా కూపీ లాగగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి భారీగా లబ్ధి పొందినట్లు అంచనాకు వచ్చారు. మద్యంబాటిళ్లు విక్రయించిన తర్వాత మిగిలే ఖాళీ అట్టపెట్టెల ద్వారా వచ్చిన సొమ్ములోనూ వాటా అడిగేవారని సమాచారం. ‘సీఐడీలో 1.19కోట్లు దుర్వినియోగం చేశారని ఒక ఐపీఎ్‌సపై కేసు నమోదైంది. మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ ఇంతకు వంద రెట్లు ఎక్కువగా తీసుకుని రిటైరై వెళ్లిపోయారు’ అంటూ ఉన్నతస్థాయి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖాళీసీసాలు, మూతలు, వాటిపై లేబుళ్లు సైతం వదలకుండా ప్రతి దాంట్లోనూ కమీషన్లు కొట్టేసిన బాగోతం వెలుగులోకి వస్తోంది.