Industrial Growth in AP: సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:06 AM
12.05 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముందురోజు గురువారం కుదిరిన ఒప్పందాలను కూడా కలుపుకొంటే 400కిపైగా కంపెనీలు మొత్తం రూ.11,91,972 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.
తొలి రోజు రూ.8,26,668 కోట్ల ఎంవోయూలపై సంతకాలు
ముందురోజుతో కలిపి రూ.11,91,972 కోట్లకు ఎంవోయూలు
13,32,445 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు
మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 సంస్థలతో అవగాహన
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విశాఖలో శుక్రవారం ప్రారంభమైన సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. రూ.8,26,668 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 365 కంపెనీలు అవగాహనా ఒప్పందాలు చేసుకున్నాయి. వీటితో 12.05 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముందురోజు గురువారం కుదిరిన ఒప్పందాలను కూడా కలుపుకొంటే 400కిపైగా కంపెనీలు మొత్తం రూ.11,91,972 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. వీటి ద్వారా 13,32,445 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వీటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు జరుగగా.. మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 ఒప్పందాలు కుదిరాయి. శుక్రవారం కుదిరిన ఎంవోయూల్లో అత్యధికం 121 వాణిజ్యం, పరిశ్రమలకు చెందినవే. తర్వాతి స్థానంలో ఐటీ ఈ అండ్ సీ 95, విద్యుత్ రంగానికి సంబంధించి 44 ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సులో శుక్ర, శనివారాల్లో కలిపి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేయగా.. సదస్సుకు ముందే పలువురు ఒప్పందాలు చేసుకోవడంతో శుక్రవారం నాటికే పెట్టుబడులు రూ.11.91 లక్షల కోట్లు దాటిపోయాయి. సీఎం సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, జెఎం బక్సీ, రిలయన్స్, టాటా వపర్, శ్రీ సిమెంట్, హెచ్‌ఎ్‌సఎల్, పతంజలి ఫుడ్స్ వంటివి ఉన్నాయి. ఇవి పెట్టే పెట్టుబడులు రూ.3,50,186 కోట్లు కాగా.. లభించే ఉద్యోగావకాశాలు 4,16,290 వరకు ఉంటాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దనరెడ్డి, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. సీఆర్‌డీఏలో రూ.36,648 కోట్లు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో రూ.1,680 కోట్లు, మున్సిపల్ డైరెక్టరేట్‌కు రూ.1,800 కోట్లకు ఎంవోయూలు జరిగాయి. కార్యక్రమంలో సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ తేజస్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1,140 కోట్లతో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల పరిశ్రమ
రాష్ట్రంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాం. రూ. 1,140 కోట్లతో తిరుపతికి దగ్గరలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం. 1500 మందికి ప్రత్యక్షంగా, మరో 2,500 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ మదర్ బోర్డులను కారు, కంప్యూటర్, సెల్‌ఫోన్, వందేభారత్ ట్రైన్స్, ఎనర్జీ మోటార్స్ వంటి వాటిల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం కర్ణాటకలోని తుమకూరులో యూనిట్ ఉంది. రాష్ట్రంలో రెండో యూనిట్ పెట్టబోతున్నాం. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం.
- ఎల్.నందకుమార్, సిప్సా టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్
తొలి కన్జ్యూమర్ కో పైలట్
వినియోగదారుల సమస్యలను ఒక్క క్లిక్‌తో పరిష్కరించే తొలి ఏఐ కన్జ్యూమర్ కో పైలట్‌ను అభివృద్ధి చేశాం. బ్యాంకింగ్ ఫీజులు, ఈ కామర్స్ రిఫండ్లు, టెలికాం బిల్లింగ్, ఇన్సూరెన్స్ తిరస్కరణలు, రియల్ ఎస్టేట్ సమస్యల్లో క్లిష్ట ప్రశ్నలకు ఈ ఏఐ కొన్ని సెకన్లలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్పష్టమైన న్యాయ సలహా అందిస్తుంది. ప్రతి పౌరుడిని హక్కుల గురించి అవగాహన కల్పించడమై లక్ష్యం. ఇది ప్రతి ఇంటికీ డిజిటల్ న్యాయ సలహాదారుగా ఉంటుంది. స్టార్టప్ తరహాలో డిజిటల్ సేవలు అందించేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోబోతున్నాం.
- ఏపీకి చెందిన యువ టెక్ ఇన్నోవేటర్,
న్యాయవాది మహ్మద్ బాజీ
గోద్రెజ్ ఆగ్రో వెట్ కేంద్రాలు
సిరిపురం (విశాఖపట్నం), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు ఆయిల్‌పామ్ రైతులకు మేలు కలిగేలా రాష్ట్రంలో ఐదు సమాధాన్ కేంద్రాల ఏర్పాటుకు గోద్రెజ్ ఆగ్రో వెట్ సంస్థ ముందుకువచ్చింది. ఇందుకోసం రూ. 70 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ సీఈవో, ఎండీ సునీల్ కటారియా కృతజ్ఞతలు తెలిపారు.
ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందం
40 వేల కోట్లతో ఉప్పాడలో పరిశ్రమ ఏర్పాటు
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వంతో ఏఎం గ్రీన్ సంస్థ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. తొలిరోజు సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ సమక్షంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.40 వేల కోట్లతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో పరిశ్రమను పెట్టనుంది.