CM Chandrababu Naidu: రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతాం
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:43 AM
ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పేర్కొన్నాయి. సీఎం చంద్రబాబు ముందుచూపు అద్భుతమని..
యువతలో నైపుణ్యాలు పెంచుతాం.. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. విశాఖ సదస్సులో పారిశ్రామిక దిగ్గజాల ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పేర్కొన్నాయి. సీఎం చంద్రబాబు ముందుచూపు అద్భుతమని.. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించాయి. విశాఖలో శుక్రవారం ప్రారంభమైన రెండ్రోజుల భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, సీఈవోలు హాజరయ్యారు. పారిశ్రామిక, వాణిజ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం తెచ్చిన పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం బాగున్నాయని వారు తెలిపారు. ఎవరెవరు ఏమన్నారంటే..
ఆంధ్ర.. స్టార్టప్ స్టేట్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీ ఆధునికంగా మారుతోంది. దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా నిలిచింది. సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలోను, డేటా సెంటర్లు, ఓడ రేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లోను అదానీ సంస్థ భాగస్వామిగా ఉంటుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న యువతతో రాష్ట్రాన్ని మంత్రి లోకేశ్ తీర్చిదిద్దుతున్నారు. ఏపీకి అసలైన సీఈవో చంద్రబాబే. పోర్టులు, లాజిస్టిక్స్, సిమెంట్, ఇన్‌ఫ్రా, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో రూ.40వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. వీటితో కలిపి మేం లక్ష కోట్ల రూపాయలు పెట్టినట్లు అవుతుంది. వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం.
- కరణ్ అదానీ, అదానీ పోర్బ్స్-సెజ్ ఎండీ
ఆ హిస్టరీ ఏపీలో రిపీట్ అవుతుంది
హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం నిర్మించాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలన్నీ అటు వైపు చూస్తున్నాయి. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తరువాత ఆ హిస్టరీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏవియేషన్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని తొలుత గుర్తించింది చంద్రబాబే. భోగాపురంలో 500ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీ, ఎంఆర్‌వో, ఆర్‌అండ్‌డీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుతో రక్షణ ఉత్పత్తుల తయారీ ప్రారంభిస్తాం.
- గ్రంధి మల్లికార్జునరావు, జీఎంఆర్ గ్రూపు చైర్మన్
జినోమ్ వ్యాలీ నుంచే కొవిడ్ టీకాలు
చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో జినోమ్ వ్యాలీ ఏర్పాటుచేశారు. ఇలాంటి ఎకోసిస్టమ్ తయారు కావడం వల్లే భారత్ బయోటెక్ కొవిడ్ టీకాలు తయారు చేసింది. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతో ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కృతమవుతోంది.
- సుచిత్రా కె. ఎల్లా,
భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు
ఏపీ.. గ్రోత్ సెంటర్
భారతదేశానికి గ్రోత్ సెంటర్‌గా ఏపీ ముందుంది. యువతకు అండగా ఉండేలా విజయవాడ, విశాఖ, రాజమండ్రి,, శ్రీసిటీ, తిరుపతిలో రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
- సంజీవ్ బజాజ్, బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ
ఏఐ, డేటాలో ఏపీ ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా యుగం నడుస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఈ రంగాల్లో ముందడుగు వేస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో భారత్ ఫోర్బ్స్ భాగస్వామ్యం వహిస్తుంది. నౌకా నిర్మాణం, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ ఫోర్ట్స్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాం. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తాం.
- అమిత్ కల్యాణి, -భారత్ ఫోర్బ్స్ జాయింట్ ఎండీ
బాబు ఆకాంక్షలకు అనుగుణంగా..
రాష్ట్ర సీఈవో చంద్రబాబు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విశాఖలో లులూ షాపింగ్ మాల్‌కు వారం రోజుల్లో శంకుస్థాపన చేసి.. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తాం. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా, సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలుసుకున్నాం. దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ (కొచ్చిన్ కంటే) విశాఖలో నిర్మించాల్సిందిగా వారు కోరగా అంగీకరించాను. అందుకు స్థలాన్ని చంద్రబాబే సమకూర్చారు. 2018 ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయంలో క్షమించాలని కోరుతూ వెంకయ్యకు క్షమాపణ లేఖ రాశా. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడం, అదే స్థలం ఖాళీగా ఉండడంతో మమ్మల్ని ఆహ్వానించి అదే షాపింగ్‌మాల్ నిర్మించాలని కోరడం సంతోషం కలిగించింది. ఈ మాల్‌తో నేరుగా 5 వేల మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి లభిస్తుంది. మామిడి, జామ గుజ్జును ఎగుమతి చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
- యూసఫ్ అలీ, లులూ గ్రూప్ చైర్మన్.
విశాఖలో మాల్, రాయలసీమలో లాజిస్టిక్స్ కేంద్రం
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కూడా ఏర్పాటు
సీఎం సమక్షంలో లులూ ఒప్పందాలు
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి విశాఖ భాగస్వామ్య సదస్సులో లులూ ఇంటర్నేషనల్ సంస్థ ప్రభుత్వంతో శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యూసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకారపత్రాలు మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300కుపైగా మాల్స్ నిర్వహిస్తున్న లులూ.. వారికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల వద్ద కొనుగోలు చేయాలని చంద్రబాబు కోరారు. మామిడి, జామ పల్ప్‌తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి వచ్చే జనవరి నుంచి ఎగుమతులు ప్రారంభించనున్నట్టు లులు తెలిపింది. త్వరలో లాజిస్టిక్ ప్రొక్యూర్‌మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్టు యూసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖలో 13.83 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,066 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌లో 5వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.