AP Govt: బనకచర్లలో భారీ మార్పులు
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:00 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై రాష్ట్రప్రభుత్వం పునరాలోచనలో పడింది. రూ.81,900 కోట్ల అంచనాతో మూడు దశల్లో దీనిని చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర జల వనరుల శాఖ..
నల్లమల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం
ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే?
2 దశల్లో ప్రతిపాదిత పథకం నిర్మాణం
అంచనా వ్యయం రూ.49,550 కోట్లు
పోలవరం కుడి కాలువ గుండా ప్రకాశం బ్యారేజీ ఎగువన దాములూరు వరకు వరద నీరు తరలింపు
హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కుడి కాలువలోకి
అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలింపు
పాత ఆర్‌ఎఫ్‌సీ రద్దు.. త్వరలో కొత్త టెండర్లు?
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై రాష్ట్రప్రభుత్వం పునరాలోచనలో పడింది. రూ.81,900 కోట్ల అంచనాతో మూడు దశల్లో దీనిని చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర జల వనరుల శాఖ.. ఈ ప్రాజెక్టు డిజైన్‌లో భారీ మార్పుచేర్పులకు సిద్ధమవుతోంది. పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీన్ని రూ.49,550 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో చేపట్టాలని భావిస్తోంది. పోలవరం-బనకచర్ల పథకానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించేందుకు ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ గత నెల 11న జలవనరుల శాఖ టెండర్లు (ఆర్‌ఎఫ్‌సీ) పిలిచింది. ఆ వెంటనే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యతిరేకత మొదలైంది. గోదావరికి వరద సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసుకుంటామని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ నేతల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో వరద జలాల లభ్యతపై కేంద్ర జలసంఘంతో కలిసి అధ్యయనం తేల్చాలని సాంకేతిక మదింపు కమిటీ ఏపీకి సూచించింది. వాస్తవానికి ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టడం ఆచరణ సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు కూడా స్పష్టంచేశారు. గోదావరి జలాలను కృష్ణా పరివాహకానికి మళ్లించగానే... కృష్ణా జలాల్లో 80 టీఎంసీలను ఎగువ రాష్ట్రాలకు అప్పగించాల్సి వస్తుందని గుర్తుచేశారు. దీనికంటే.. ప్రకాశం బ్యారేజీలోకి నేరుగా గోదావరి జలాలను ఎత్తిపోయకుండా ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఇబ్రహీంపట్నం సమీపంలోని దాములూరు వద్ద ఓ అక్విడెక్టును నిర్మించాలని సూచించారు.
పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను తరలించి.. హరిశ్చంద్రపురం వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయాలపై పెద్దఎత్తున కసరత్తు చేస్తున్న జలవనరుల శాఖ.. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టేందుకు రూ.49,550 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తోంది. ఇందులో 50 శాతం..విదేశీ రుణం.. కేంద్ర నిధులు 20 శాతం అంటే రూ.9,910 కోట్లు.. రాష్ట్రం వాటా పది శాతం (రూ.5,000 కోట్లు), ప్రైవేటు వాటా 20 శాతం (రూ.9,910 కోట్లు). ప్రాజెక్టు తొలిదశలో రూ13,800 కోట్లు, రెండో దశలో 35,750 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. పాత పీఎ్‌ఫసీని రద్దుచేసి..నల్లమలసాగర్ వరకు డీపీఆర్ రూపొందించేందుకు ఆసక్తికనబరిచే సంస్థల కోసం మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని యోచిస్తున్నారు.
ప్రాజెక్టు నిర్మాణమిలా..: పోలవరం-నల్లమల సాగర్ తొలిదశలో గోదావరి వరదనీటిని తాడిపూడి వరద కాలువద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పంపి.. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దాములూరు (ఎన్టీఆర్‌జిల్లా)దాకా (175కిలోమీటర్ల మేర) తీసుకెళ్లి.. అక్కడి నుంచి హరిశ్చంద్రపురం వద్ద నాగార్జున సాగర్ కుడికాలువలోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి నల్లమల్లసాగర్‌కు తీసుకెళ్లేందుకు 29 కిలోమీటర్ల మేర మూడుటన్నెళ్లను తవ్వుతారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.