AP Govt: ఉపాధి నిధులతో మ్యాజిక్ డ్రైన్లు
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:20 AM
గ్రామాల్లో తక్కువ వ్యయంతో మురుగు కాల్వల నిర్మాణానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. సిమెంట్‌రోడ్లు, డ్రైన్లు భారీ ఎత్తున నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో...
గ్రామాల్లో తక్కువ ఖర్చుతో మురుగుకాల్వల నిర్మాణం
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు విజయవంతం
అక్టోబరు 2 నాటికి వంద గ్రామాల్లో పూర్తి
ఒక్కో జిల్లాలో నాలుగు గ్రామాలకు నిర్మాణం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామాల్లో తక్కువ వ్యయంతో మురుగు కాల్వల నిర్మాణానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. సిమెంట్‌రోడ్లు, డ్రైన్లు భారీ ఎత్తున నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో 4 వేల కి.మీ. సిమెంట్‌రోడ్లు నిర్మించారు. ఆ రోడ్ల పక్కన కాల్వలు నిర్మించలేదు. కొన్ని గ్రామాల్లో కాల్వలు నిర్మించినప్పటికీ నిర్వహణ లోపం సమస్యగా మారింది. చెత్త, చెదారం పడి కాల్వలు పూడిపోవడంతో వీధులు దుర్గంధంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామపంచాయతీలు డ్రైన్లు నిర్మించాలా? వద్దా? అనే మీమాంసలో కూడా పడ్డాయి. కొన్ని గ్రామాల్లో వరద నీటి తాకిడి ఉండటం వల్ల డ్రైన్లు కావాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ డ్రైన్లనూ నిర్వహించలేక పగులగొట్టేశారు. దీంతో గ్రామాల్లో అంత వ్యయం చేసి డ్రైన్లు నిర్మించినా...అవి ఉపయోగించకపోతే నిధులు వృథా అవుతాయని భావించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తక్కువ వ్యయంతో ఉపయోగపడే డ్రైన్లు నిర్మించాలని యోచించారు. ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో కూడా మేజిక్ డ్రైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పరిశీలించారు.
ప్రత్యేక టెక్నాలజీతో నిర్మాణం..
మేజిక్ డ్రైన్లను ప్రత్యేక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. రూ.4 లక్షల వ్యయం అయ్యే సిమెంట్ డ్రైన్‌కు బదులుగా రూ.90 వేలతో మేజిక్ డ్రైన్‌ను నిర్మించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు తీసుకుంది. పైగా ఈ డ్రైన్లతో ఎక్కడికక్కడ భూగర్భజల వనరులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. తక్కువ మురుగునీరు, తక్కువ నీటి తాకిడి ఉన్న గ్రామాల్లో వీటి నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్న గ్రామాల్లో వీటి నిర్మాణం చేపడతారు. సైడ్ కాల్వలను మూడు లేయర్లుగా తవ్వి ఒక్కో లేయర్‌ను ఒక్కో సైజ్ మెటల్‌తో భర్తీ చేస్తారు. ప్రతి 50 మీటర్లకు ఒక సోక్ పిట్‌ను సైడ్ డ్రైన్లలో నిర్మిస్తారు. ఇళ్ల నుంచి వచ్చిన మురుగునీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు తీసుకున్నారు.
వంద గ్రామాల్లో నిర్మించాలని లక్ష్యం..
అక్టోబరు 2 లోపు వంద గ్రామాల్లో మేజిక్ డ్రైన్లు నిర్మించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ లక్ష్యాలను నిర్దేశించింది. ఒక్కో జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి మేజిక్ డ్రైన్లు నిర్మించనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో అంచలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా మొదట వంద గ్రామాల్లో నిర్మించాలని భావిస్తున్నారు. తక్కువ వ్యయంతో నిర్మాణం పూర్తి కావడంతో పాటు గ్రామాల్లో డ్రైన్లు నిరుపయోగం కాకుండా ఉంటాయని చెప్తున్నారు. అంతే గాక గ్రామాల్లో తక్కువ వెడల్పు రోడ్లు ఉన్న చోట సైడ్ డ్రైన్ల నిర్మాణం కష్టతరం అవుతోందని, అదే మేజిక్ డ్రైన్లు నిర్మించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.